మొబైల్ ఫోన్ గ్యాలరీల్లో ఆధార్, పాన్ కార్డుల ఫొటోలను ఉంచుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు.
వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన ఫొటోలు, సమాచారాన్ని డిజీలాకర్లలో భద్రపరుచుకోవాలని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ”హ్యాక్ ప్రూఫ్” సదస్సులో రక్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ కొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మొబైల్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందువల్ల గ్యాలరీల్లో ఆధార్, పాన్ కార్డు ఫొటోలు ఉంచుకోవడం సురక్షితం కాదని తెలిపారు. అన్నింటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకోకూడదని, పాస్వర్డ్లు బలంగా ఉండాలని, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు.
అలాగే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి అనే అంశాలపై ప్రతి ఇంట్లో చర్చలు జరగాలని సూచించారు. కాగా, ఆన్లైన్లో ఎలా నడుచుకోవాలనే డిజిటల్ హైజీన్‌ను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని రక్షిత్ టాండన్ స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వినియోగించే ఫోన్ నెంబర్లకు ఇన్కమింగ్ సేవలు ఉండవని, కొత్త నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లను తీయకపోవడమే ఉత్తమం అని సూచించారు.
































