2025 సెప్టెంబర్ 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్యరంగాన్ని మాత్రమే కాకుండా సామాన్య ప్రజల జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేయనున్నాయి.
ముఖ్యంగా రోగుల ప్రాణాలను రక్షించే 33 అరుదైన, ఖరీదైన మందులపై 12 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి సున్నాగా మార్చింది కేంద్రంలోని మోదీ సర్కారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ఇది కేవలం రేటు తగ్గింపు కాదు. దేశ ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించే నిర్మాణాత్మక సంస్కరణ అని వ్యాఖ్యానించారు. ఈ కొత్త నిర్ణయాలు సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులు, రక్త రుగ్మతలు వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు చాలా ఖరీదైనవిగా మారాయి. సాధారణంగా ఒక కుటుంబం ఇలాంటి మందుల ఖర్చు భరించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. 12 శాతం పన్ను భారంతో ఈ సమస్య మరింత తీవ్రతరంగా మారింది. ఇప్పుడు ఈ ఖరీదైన మందులపై ఆ జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా ఈ మందుల ధర గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల పేద, మధ్యతరగతి రోగులకు చికిత్స మరింత తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది.
GST కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని కేవలం రాజకీయ లేదా ఆదాయ కోణంలో కాకుండా.. ఆరోగ్య రక్షణ కోణంలో తీసుకుంది. రోగులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్సను వాయిదా వేసుకోవడం లేదా మానేయడం వంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను రహితం చేయడం ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమావేశంలో కేవలం మందులపైనే కాకుండా.. ఇతర వస్తువులపైనా పన్ను తగ్గింపులు ఆమోదించబడ్డాయి. 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగిస్తూ.. 5 శాతం, 18 శాతం స్లాబ్‌లు అమలు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల పన్ను నిర్మాణం మరింత సులభతరం అవుతుందని.. వ్యాపారాలు, వినియోగదారులకు ఒకే విధమైన స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
GST లేని 33 మందుల జాబితా
onasemnogene abeparvovec, asciminib, mepolizumab, pegylated liposomal irinotecan, daratumumab, teclistamab, amivantamab, alectinib, risdiplam, obinutuzumab, polatizotinib, vedazotinab, spegolimab, velaglucerase alpha, agalsidase alpha, rurioctocog alfa pegol, idursulfate, alglucosidase alpha, laronidase, olipudase alpha, tepotinib, avelumab, emicizumab, belumosudil, evolocumab, cysteamine bitartrate, C1 inhibitor (injection), inclisiran
క్లుప్తంగా చెప్పాలంటే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆరోగ్యరంగానికి గేమ్-చేంజర్‌గా మారింది. క్యాన్సర్ రోగులు, అరుదైన జన్యుపరమైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు ఇది వరంగా మారనుంది. మందులపై జీఎస్టీ రద్దుతో పాటు పన్ను స్లాబుల సరళీకరణ కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయాలు అమలులోకి వచ్చిన వెంటనే రోగులు, వారి కుటుంబాలు, ఆరోగ్య రంగం మొత్తం ఊరట పొందే అవకాశం ఉంది.
































