500 ఎకరాల ఆసామి.. హీరోగా ట్రై చేసి ఆస్తులమ్ముకున్నాడు.. ఇప్పుడు

కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని పాత్రలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా పెదవులపై చిరునవ్వు వస్తుంటుంది. అలాంటి పాత్రలో నటించి సినిమా విజయంలో భాగమయ్యాడు సత్యన్‌ (Tamil Actor Sathyan).


ఇతడు స్నేహితుడు (తమిళంలో నంబన్‌) మూవీలో సైలెన్సర్‌గా నటించాడు. క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుంటారు.

500 ఎకరాల ఆసామి
ఇదే కాదు, రాజా రాణి, తుపాకి, గజిని, పులి, రాధే శ్యామ్‌, జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌.. ఇలా 70కిపైగా సినిమాల్లో నటించాడు. నిర్మాత మదంపట్టి శివకుమార్‌ ఏకైక కుమారుడే సత్యన్‌. శివకుమార్‌కు 500 ఎకరాల పొలం, ఐదు ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగ్లా ఉండేవి. విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ పైకి కలర్‌ఫుల్‌గా కనిపించే సినిమా ప్రపంచం ఆ ఆస్తిని కర్పూరంలా కరిగించేసింది. శివకుమార్‌ నిర్మాతగా మారడంతోనే కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు, భారీ నష్టాలు మూటగట్టుకున్నాడు. దాన్నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులు కూడా అమ్ముకున్నాడు.

హీరోగా అట్టర్‌ ఫ్లాప్‌
నిజానికి సత్యన్‌ కమెడియన్‌ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. 2000వ సంవత్సరంలో ఇలయవన్‌ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దారుణ ఫలితాల్ని ఎదుర్కొంది. కొడుకును హీరోగా పెట్టి ‘కన్న ఉన్నై తెడుకిరెన్‌’ అని మరో సినిమా చేయగా అది కూడా ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు ఫ్లాపులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీశాయి. తండ్రి మరణం తర్వాత పరిస్థితి మరింత అధ్వాణ్నంగా మారడంతో సత్యన్‌.. బంగ్లాను కూడా అమ్మక తప్పలేదు.

టాప్‌ కమెడియన్‌.. అయినా!
హీరోగా కలిసొచ్చేలా లేదని సత్యన్‌ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే స్థిరపడిపోయాడు. కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్‌ పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. స్నేహితుడు, రాజా రాణి వంటి చిత్రాలు అతడిని టాప్‌ కమెడియన్‌గా నిలబడెట్టాయి. కానీ పోగొట్టుకున్న ఆస్తులు మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ప్రముఖ నటుడు సత్యరాజ్‌ ఇతడికి దగ్గరి బంధువు అవుతాడు. సత్యరాజ్‌ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సత్యన్‌ తండ్రే పాకెట్‌మనీ ఇచ్చేవాడు!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.