బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు మధ్యలో ఆపి హెల్మెట్ ఉందా? లైసెన్స్ ఉందా? RC ఉందా? పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా అని సవాలక్ష ప్రశ్నలడిగి…
ఏ ఒక్కటి లేకపోయినా భారీగా ఫైన్ లు వేసి, వాటిని ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. కొన్నిసార్లు కేసులు బుక్ చేసి కోర్టుల చుట్టూ తిప్పిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగులు అయితే వారి జీతంలో పది శాతం వీటికే పోతుంది. అయితే ఈ వ్యవహారంపై ఓ కామన్ మ్యాన్ నడిరోడ్డుపై వినూత్న నిరసనకు దిగాడు. మా దగ్గర ఏ ఒక్కటి లేకపోయినా వందల రూపాయలు ఫైన్ల రూపంలో వసూలు చేస్తున్నారు, మరి మేము ప్రయాణించే రోడ్లు సరిగా లేకుండా, గుంతలమయంగా ఉన్నాయి, వాటికి మీరు ఎంత ఫైన్ కడుతున్నారంటూ నడిరోడ్డుమీద నిరసనకు దిగాడు.
అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ శ్యామ్ కుమార్ అనే వ్యక్తి .. ‘పోలీసు కమిషనర్, కలెక్టర్ గారూ.. రోడ్డుమీద వెళ్తున్నపుడు ఏది లేకపోయినా ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగా లేవు కదా, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు’ అని ప్లకార్డ్ ప్రదర్శిస్తూ.. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహాదారిపై ధర్నాకు దిగాడు. అటుగా వెళ్తున్నవారంతా ఆసక్తిగా గమనించి, నిజమే కదా అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, అతన్ని సముదాయించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. అయితే ఈ తతంగాన్ని అంతా ఓ వ్యక్తి తీసి నెట్లో పోస్ట్ చేయగా… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేలాది నెటిజన్స్ శ్యామ్ నిరసనను ప్రశంసిస్తున్నారు
































