జీఎస్టీ 2.0 ద్వారా ఇప్పుడు కార్లపై కేవలం రెండు స్లాబ్‌లలో మాత్రమే పన్ను విధిస్తారు. అవి 5% మరియు 18%. అయితే, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా 40% స్లాబ్‌ను కేటాయించారు.
ఈ కొత్త పన్ను విధానం ప్రకారం, ఇంతకు ముందు జీఎస్టీతో కలిపి వసూలు చేసిన కాంపెన్సేషన్ సెస్ (Compensation Cess)ను పూర్తిగా రద్దు చేయడం కార్ల కొనుగోలుదారులకు ఒక పెద్ద ఊరట.
ఈ మార్పు వల్ల చిన్న కార్లు, టూ-వీలర్ల ధరలు మరింత తగ్గనున్నాయి. అయితే, మధ్యతరహా, పెద్ద కార్ల ధరలపై ప్రభావం మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కార్లు, అలాగే 1,200సీసీ కంటే ఎక్కువ పెట్రోల్ ఇంజిన్‌లు లేదా 1,500సీసీ కంటే ఎక్కువ డీజిల్ ఇంజిన్‌లు ఉన్న మోడల్స్‌పై ఇప్పుడు 40% పన్ను వర్తిస్తుంది.
పాత, కొత్త పన్ను విధానాల మధ్య తేడా
పాత విధానంలో, అన్ని ప్యాసింజర్ కార్ల మీద 28% జీఎస్టీ ఉండేది. దానికి అదనంగా, ఇంజిన్ పరిమాణం, బాడీ స్టైల్‌ను బట్టి 1% నుంచి 22% వరకు సెస్ వసూలు చేసేవారు. దీనివల్ల పెద్ద కార్లపై పన్ను 45% నుంచి 50% వరకు పెరిగేది.
ఇప్పుడు జీఎస్టీ 2.0 ప్రకారం, సెస్ పూర్తిగా రద్దయింది. బదులుగా, ఈ కార్లు ఇప్పుడు 40% లగ్జరీ స్లాబ్‌లోకి వస్తాయి. ఈ హెడ్‌లైన్ రేట్ ఎక్కువగా కనిపించినప్పటికీ, చాలా మధ్యస్థ, పెద్ద కార్ల ధరలు వాస్తవానికి మునుపటి కంటే తక్కువగానే ఉన్నాయి.
1,200సీసీ నుంచి 1,500సీసీ మధ్య ఉన్న పెట్రోల్ కార్లు: పాత పన్ను 45% నుంచి ఇప్పుడు 40%కి తగ్గింది.
1,500సీసీ కంటే ఎక్కువ ఉన్న డీజిల్ కార్లు: పాత పన్ను 48% నుంచి ఇప్పుడు 40%కి తగ్గింది.
దీనివల్ల, ఈ పెద్ద వాహనాల ఆన్-రోడ్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
పాత ధరలు Vs కొత్త ధరలు: ప్రముఖ ఎస్‌యూవీలు
4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కొన్ని ప్రముఖ మోడల్స్‌కు పాత, కొత్త ఆన్-రోడ్ ధరల పోలిక కింద చూడవచ్చు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ఆధారంగా లెక్కించినవి.)
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): పాత ఆన్-రోడ్ ధర రూ. 17.70 లక్షల నుంచి రూ. 33.20 లక్షలు కాగా, కొత్త ధర రూ. 17.15 లక్షల నుంచి రూ. 32.16 లక్షలు.
కియా సెల్టోస్ (Kia Seltos): పాత ఆన్-రోడ్ ధర రూ. 17.83 లక్షల నుంచి రూ. 32.63 లక్షలు కాగా, కొత్త ధర రూ. 17.27 లక్షల నుంచి రూ. 31.61 లక్షలు.
హోండా ఎలివేట్ (Honda Elevate): పాత ఆన్-రోడ్ ధర రూ. 18.97 లక్షల నుంచి రూ. 26.58 లక్షలు కాగా, కొత్త ధర రూ. 18.37 లక్షల నుంచి రూ. 25.75 లక్షలు.
మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara): పాత ఆన్-రోడ్ ధర రూ. 18.19 లక్షల నుంచి రూ. 32.82 లక్షలు కాగా, కొత్త ధర రూ. 17.62 లక్షల నుంచి రూ. 31.79 లక్షలు.
మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio-N): పాత ఆన్-రోడ్ ధర రూ. 20.35 లక్షల నుంచి రూ. 40.45 లక్షలు కాగా, కొత్త ధర రూ. 19.68 లక్షల నుంచి రూ. 39.22 లక్షలు.
టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta): పాత ఆన్-రోడ్ ధర రూ. 28.47 లక్షల నుంచి రూ. 42.63 లక్షలు కాగా, కొత్త ధర రూ. 27.53 లక్షల నుంచి రూ. 41.15 లక్షలు.
టయోటా ఫార్ట్యూనర్ (Toyota Fortuner): పాత ఆన్-రోడ్ ధర రూ. 57.11 లక్షల నుంచి రూ. 70.81 లక్షలు కాగా, కొత్త ధర రూ. 55.31 లక్షల నుంచి రూ. 68.57 లక్షలు.
ఈ మార్పుల వల్ల మీపై ప్రభావం ఎలా ఉంటుంది?
జీఎస్టీ 2.0 ఒక రకంగా “రెండు అంచుల కత్తి” లాంటిది. చిన్న కార్లకు 18% పన్ను స్లాబ్ వల్ల భారీ ఊరట లభిస్తుంది. ఇది ఎంట్రీ-లెవల్ కార్ల అమ్మకాలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, పెద్ద కార్లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలను ఇప్పుడు ‘లగ్జరీ వస్తువుల’ కేటగిరీలో 40% స్లాబ్‌లోకి చేర్చినప్పటికీ, సెస్ రద్దు కావడం వల్ల అవి మునుపటి కంటే కొంచెం తక్కువ ధరకే లభిస్తాయి.
క్రెటా, హారియర్, ఫార్చూనర్ వంటి కార్లు కొనాలనుకునే వినియోగదారులకు ఈ మార్పులు మంచి అవకాశాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఇది వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది. అయితే, టెస్లా, బీవైడీ వంటి విదేశీ లగ్జరీ ఈవీల (EV)పై కూడా 40% పన్ను వర్తిస్తుంది. ఇది వాటి వృద్ధిని స్వల్పంగా ప్రభావితం చేయొచ్చు.
































