రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్ విధానంలో అమలు చేసే యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందనున్నాయి. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు దీనిద్వారా ప్రయోజనం పొందనున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించేలా నూతన విధానాన్ని తీసుకొచ్చారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సచివాలయంలో మీడియాకు వివరించారు.
10 కొత్త వైద్య కళాశాలలకు ఆమోదం
పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు.
క్యాబినెట్‌లో ఇతర నిర్ణయాలు
- 2025 జనవరి 1 నుంచి రాజధానిలో భూమి కేటాయించిన విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం,లీజు ఒప్పందాలు అమలు చేసేటప్పుడు రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుంచి మినహాయింపు.
- రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ ప్రాంతం మినహా అర్బన్ లోకల్ బాడీ సంస్థలు, ఉడాలు, సీఆర్‌డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించే భవనాలు, మంజూరైన ప్లాన్లను ఉల్లంఘించి, నిర్మించిన భవనాల నియంత్రణ, జరిమానాల విధింపు.
- మదర్ డెయిరీ ఫ్రూట్, వెజిటబుల్, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ సిఫారసులకు సమ్మతి.
- ప్రాజెక్టుల ప్రారంభంలో వేగం కోసం ఎస్‌ఐపీబీ సిఫారులకు ఆమోదం.
- అనంతపురంలోనిమడకశిరలో 1,197కోట్లతో హెచ్‌ఎ్‌ఫసీఎల్ పెట్టే పెట్టుబడి ప్రతిపాదనకు సమ్మతి
- భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫోర్‌స్టార్ అభివృద్ధికి ప్రోత్సాహకాలు.
- క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్ట్‌ను నంద్యాలజిల్లా కోటపాడు నుంచి అవుకు గ్రామానికి మార్పు.
- కడపజిల్లా జమ్ములమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో 100 మెగావాట్ల విండ్ కెపాసిటీ, కడప జిల్లా మైలవరం మండల గ్రామాల్లో 60 మెగావాట్ల సోలార్ విండ్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి హెక్సా ఎనర్జీ బీహెచ్ ఫైవ్ చేసిన అభ్యర్థనలకు ఆమోదం.
- బ్రైట్ ఫ్యూచర్ పవర్‌కు అనంతపురం జిల్లా రాయదుర్గం, బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, కానేకల్ మండల గ్రామాల్లో 349.80 మెగావాట్ల విండ్ పవర్ కెపాసిటీ కేటాయింపు సంబంధించి, అనంతపురం జిల్లాలో కుడైర్, ఉరవకొండ, వజ్రకరూర్ మండల గ్రామాల్లో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా24 ప్రైవేట్‌లిమిటెడ్‌కు 250 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ కేటాయింపులకు, కర్నూలు జిల్లా తుగ్గిలి, పత్తికొండ, దేవనకొండ, పండికోన, ఆస్పరీ మండలాల్లో సెరెంటికా రెన్యూవబుల్ ఇండియా 25 ప్రైవేట్ లిమిటెడ్‌కు 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపుల ప్రతిపాదనకు ఆమోదం.
- కడప జిల్లా కొప్పోలులోని పంప్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 360 మెగావాట్ల నుంచి 2,400 మెగావాట్లకు పెంపు.
- మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2025కు ఆమోదం.
- థర్డ్ పార్టీ ఆక్రమణలో ఉన్న వ్యక్తులకు (347 మందికి) అదనపు భూముల క్రమబద్ధీకరణ/ కేటాయింపుల కోసం రెవెన్యూశాఖ ప్రతిపాదనకు ఆమోదం.
































