మన తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌కు ఆదరణ ఎక్కువే. మన దేశంలో అత్యంత అందుబాటు రేటులో ఉన్న కాంపాక్ట్ SUV ఇది.
తక్కువ ధరకే SUV లాంటి లుక్స్ & ఫీచర్లను ఇది అందిస్తుంది కాబట్టి దీనిని “పాకెట్ SUV” అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, తాజా GST తగ్గింపుతో ఈ చిన్న SUV తెలుగు ప్రజలకు మరింత తక్కువ రేటుకు దొరుకుతుంది.
GST తగ్గింపు తర్వాత టాటా పంచ్ రేటు ఎంత తగ్గుతుంది?
ప్రస్తుతం, టాటా పంచ్‌పై 28% GST వర్తించేది. అంటే వాస్తవ ధరకు ఈ పన్ను కలిపిన తర్వాత, ప్రారంభ ధర రూ. 6 లక్షలకు చేరుకునేది. ఈ పన్ను తొలగిస్తే, పంచ్ ధర దాదాపు రూ. 4,68,750 మాత్రమే. కొత్త GST రేట్లు ఈ నెల 22వ తేదీ (22 సెప్టెంబర్ 2025) నుంచి వర్తిస్తాయి. ఇప్పుడు 28% GST కి బదులుగా 18% GST మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీని అర్థం కస్టమర్‌పై పన్ను భారం చాలా తగ్గుతుంది & ప్రారంభ మోడల్ ధర దాదాపు రూ. 5,53,125 కు దిగి వస్తుంది. ఈ విధంగా, దసరా & దీపావళి పండుగ సీజన్లో టాటా పంచ్ మునుపటి కంటే దాదాపు రూ. 50,000 చౌకగా లభిస్తుంది.
డిజైన్ ఎలా ఉంది?
టాటా పంచ్ అంటేనే బలమైన & SUV స్టైల్‌కు ప్రతిరూపం. టాటా హారియర్ & సఫారీ వంటి పెద్ద SUVల స్ఫూర్తితో బయటి భాగం ఉంటుంది. కారు ముందు భాగంలో స్ల్పిట్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLs & ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్ క్లాడింగ్ & 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనిని స్పోర్టీ లుక్‌లోకి మారుస్తాయి. కారు వెనుక వైపున, LED టెయిల్‌ల్యాంప్‌లు & రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వాహనానికి ప్రీమియం ఫినిష్ ఇస్తాయి.
లోపలి భాగం ప్రీమియమేనా?
పంచ్ లోపలి భాగం డ్యూయల్-టోన్ బ్లాక్ & గ్రే కలర్ థీమ్‌లో డెకరేట్ చేశారు, ఇది దీనికి ఆధునికంగా & విశాలమైన అప్పీల్ ఇస్తుంది. ఆధునిక కాలపు అవసరాలను తీర్చే డాష్‌బోర్డ్‌పై 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు, సెమీ-లెథరెట్ సీట్లు కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో అందించారు. సౌకర్యం & సౌలభ్యం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & వాయిస్-ఆపరేటెడ్ సన్‌రూఫ్ కూడా చేర్చారు.
5-స్టార్ పంచ్
టాటా పంచ్ భద్రత పరంగా కూడా బలంగా ఉంది. గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ అడల్ట్ సేఫ్టీ & 4-స్టార్ చిల్డ్రన్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS & EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్, రియర్ వ్యూ కెమెరా & ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. అలాగే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (iTPMS) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ & మైలేజ్
టాటా పంచ్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది, ఇది 87 bhp పవర్ & 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ రెండింటితో కొనుగోలు చేయవచ్చు. దాని CNG వేరియంట్ 72 bhp పవర్ & 103 Nm టార్క్‌ను అందిస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, CNG వెర్షన్ మైలేజ్ కిలోగ్రాముకు 26.99 కిలోమీటర్లు.
































