ఓపెన్‌ఏఐలో భారతీయ యువకుడికి ఊహించని ఆఫర్.. నెలకు రూ.20 లక్షల శాలరీ

ఉన్నత లక్ష్యాలు, ఆశావాదం, పట్టుదలతో ముందడుగు వేస్తే తిరుగే ఉండదని నిరూపించాడో భారతీయ యువకుడు. బీటెక్ తరువాత రూ.3.5 లక్షల వార్షిక శాలరీతో ఉద్యోగ జీవితం ప్రారంభించిన అతడు ఆ తరువాత ఎనిమిది నెలలకే ఏకంగా ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.


నెలకు ఏకంగా రూ.20 లక్షల పారితోషికంతో వర్క్ ఫ్రమ్ అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు (OpenAI remote job India).

అసలేం జరిగిందీ అతడు తాజాగా ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో షేర్ చేశాడు. ఈశాన్య భారతానికి చెందిన ఆ యువకుడు తన కుటుంబంలో బీటెక్ చేసిన మొదటి వ్యక్తి. ఎన్నో ఆశలతో చదువు పూర్తి చేసుకున్నా కాంపస్ ప్లేస్‌మెంట్‌లో మాత్రం కేవలం రూ.3.5 లక్షల వార్షిక శాలరీతో జాబ్ వచ్చింది. చేసేదేమీ లేక ఉద్యోగంలో చేరినా తన లక్ష్యంపై నుంచి మాత్రం అతడు దృష్టి మరల్చలేదు. మరో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా పలు అంతర్జాతీయ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ కోసం ప్రయత్నించడం మొదలెట్టాడు. దాదాపు 500 సార్లు తిరస్కరణను ఎదుర్కున్నాడు. ఎనిమిది నెలల పాటు నిర్విరామంగా అతడు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఓపెన్‌ఏఐ అతడికి నెలకు రూ.20 లక్షల శాలరీతో ఓ ప్రాజెక్టుపై పనిచేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చింది (23-year-old engineer success story).

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో అతడు రాత్రి పగలూ తేడా లేకుండా పనిలో నిమగ్నమయ్యాడు. రోజుకు నాలుగు, ఐదు గంటలు మాత్రమే నిద్రకు కేటాయించి మిగతా సమయమంతా జాబ్‌కే కేటాయించాడు. విలువైన అనుభవం, నైపుణ్యాలను గడించాడు. ఈ వర్క్ ఫ్రమ్ హోం ఆఫర్ ఆగస్టులో ముగిసింది. అయితే, జస్ట్ 23 ఏళ్ల వయసులోనే అపార అనుభవం సొంతం చేసుకున్న ఆ యువకుడు రెట్టించిన ఉత్సాహంతో సొంత సంస్థ నెలకొల్పేందుకు రంగంలోకి దిగాడు.

చిన్న పట్టాణాల నుంచి వచ్చే తనలాంటి వారికి అతడు నెట్టింట పలు సూచనలు చేశాడు. ‘జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెందకండి. కొత్త అవకాశాల కోసం ప్రయత్నించండి. నెట్‌వర్క్‌ను పెంచుకోండి’ అని సూచించాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.