హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్ మండలం నర్కూడ వద్ద ఉంది.
13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇది హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో ఎక్కువగా సందర్శించే వాటిలో ఒకటిగా నిలుస్తోంది.
అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని.. అలాగే మరో గుండాన్ని శ్రీ రాముడి చక్ర తీర్థానికి ఉపయోగించేవారిని ఇక్కడి చరిత్ర చెబుతోంది. అలాగే ముఖమండపంలో ‘కూర్మం’ (తాబేలు) ఏర్పాటు చేసి ఉండటం కారణంగా ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.
ఇక ఆలయంలో ఎత్తయిన రాజ గోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు ఉన్నాయి. గర్భా లయంలో సీతా రామలక్ష్మణులు కొలువై ఉన్నారు. వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తాడు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 30 కి.మీ, శంషాబాద్ బస్ స్టాప్ నుంచి 5 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయం సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్మపల్లిలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు కల్యాణ రాముడుగా ప్రసిద్ధి చెందాదు. ఇక్కడ కల్యాణం, సంతానం వంటి కోర్కెలను నెరవేర్చుతూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు.
ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ మూర్తులను నర్కూడ నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి.. ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుపుతారు. కల్యాణానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అమ్మపల్లి ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు, మాస కల్యాణం నిర్వహిస్తుంటారు. ఇక్కడ శ్రీరాముడు లోక కల్యాణం కోసం కొలువు దీరినట్లు భక్తులు విశ్వసిస్తారు. సొంత కోర్కెల కంటే సమాజం బాగుకోసం కోరే మొక్కులను స్వామి తీర్చుతాడని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నగరం నుంచి మెహదీపట్నం ద్వారా ఆలయానికి చేరుకోవడానికి, శంషాబాద్ బేగంపేట జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవాలి. అలాగే 5 కి.మీ. డ్రైవ్ చేయాలి. మీరు ORR తీసుకుంటే, శంషాబాద్ విమానాశ్రయం ఎండింగ్ తీసుకొని, శంషాబాద్ పట్టణం వైపు వెళ్లి బస్ స్టాప్ జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకోవాలి. ఆలయం ప్రధాన రహదారికి దగ్గరగా ఎడమ వైపున ఉంది.































