కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. అతి త్వరలో నిరీక్షణ ముగియనుంది. అంతా సవ్యంగా జరిగితే కొత్త ఏడాది నుంచి (8th Pay Commission) ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగవచ్చు.
ఇటీవలే NC-JCM స్టాఫ్ సైడ్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా కొత్త వేతన సంఘాన్ని జనవరి 2026 నుంచి అమలు చేయాలని సలహా ఇచ్చారు. ఇదే జరిగితే.. 7వ వేతన సంఘం మాదిరిగానే 8వ వేతన సంఘం అమలు కూడా జరగనుంది. 8వ వేతన సంఘం (8వ CPC) జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
జీతాలలో 30 నుంచి 34శాతం పెరుగుదలతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నాయి. జేసీఎమ్ నేత శివ్ గోపాల్ మిశ్రా ప్రకారం.. ప్రతి వేతన సంఘం షెడ్యూల్ సంవత్సరం నుంచి లెక్కిస్తారు. 7వ వేతన సంఘం ప్రయోజనాలు జనవరి 2016 నుంచి వర్తింపజేసినట్లే.. 8వ వేతన సంఘం కూడా జనవరి 2026 నుంచి అమలులోకి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించినా సవరించిన జీతం, భత్యాలతో పాటు జనవరి 2026 నుంచి ఉద్యోగులకు బకాయిలు అందనున్నాయి. భారత ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 6 శాతం నుంచి 7శాతం వద్ద ఉంది. సవరించిన వేతన నిర్మాణం ఉద్యోగులకు అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది.
నోటిఫికేషన్ ఎప్పుడు జారీ కానుంది? :
నోటిఫికేషన్ వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చు. కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనవరి 2026 నుంచి బకాయిలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం నుంచి ఏం ఆశించవచ్చు? :
- జీతాల పెరుగుదల 30 శాతం నుంచి 34 శాతం
- కనీస మూల వేతనం రూ. 34,500 నుంచి రూ. 41వేలకు పెరగవచ్చు
- కొన్ని అలవెన్సులు వంటివి స్పెషల్ డ్యూటీ అలవెన్స్, రీజినల్ అలవెన్స్ నుంచి తొలగించవచ్చు.
- డీఎ,హెచ్ఆర్ఏ, ద్రవ్యోల్బణం ఆధారంగా TA సవరిస్తారు.
- అధిక పనితీరు కనబరిచే ఉద్యోగులకు అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయి.
పెరిగిన జీతం ఎప్పుడు వస్తుంది? :
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మనస్సుల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. 8వ వేతన సంఘం ఎప్పుడు అమలు అవుతుంది? ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యాలయాల్లో ఇదే తరహా చర్చలు జరుగుతున్నాయి. జనవరి 2026 నుంచి వేతనాలు భారీగా పెరగొచ్చునని భావిస్తున్నారు.
జీతం ఎంత పెరుగుతుంది? :
జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ప్రకారం.. 8వ వేతన సంఘం ప్రతిపాదించిన విధంగా అమలు జరిగితే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతం 30 శాతం నుంచి 34శాతం వరకు పెంపు పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ జీతం భారీగా పెరుగుతుంది. లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది.
































