డిజిటల్ ఉపవాసం అంటే ఏంటో తెలుసా..? లాభాలు తెలిస్తే అవాక్కే

నేటి బిజీ జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్క్రీన్‌ల వాడకం మన దైనందిన జీవితంలో ఒక భాగం. చాలా మంది పని లేదా వినోదం కోసం డిజిటల్ పరికరాలపై ఆధారపడతారు. కానీ నిరంతరం స్క్రీన్‌ను చూడటం కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీటిని తగ్గించే బెస్ట్ ఆప్షన్ డిజిటల్ ఉపవాసం. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పెరుగుతున్న సాంకేతిక ప్రపంచంలో, మన జీవితం స్క్రీన్‌లకు అంకితమైపోయింది. ఆన్‌లైన్ విద్య, హైబ్రిడ్ వర్క్ మోడల్ వంటి కారణాల వల్ల మనం రోజుకు 8 నుంచి 10 గంటల సమయం ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు వంటి గాడ్జెట్‌ల ముందు గడుపుతున్నాం. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కంటి ఒత్తిడి తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, మెడ, భుజం నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ‘డిజిటల్ ఉపవాసం’ అనేది ఒక మంచి మార్గం. అంటే ఒక నిర్దిష్ట సమయం పాటు డిజిటల్ గాడ్జెట్‌లకు దూరంగా ఉండటం. ఇది కళ్లకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా, మానసిక అలసటను తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.


పిల్లలకు ప్రమాదం

పిల్లలు కూడా ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల మయోపియా వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అలాగే, గాడ్జెట్‌ల నుండి వచ్చే బ్లూ లైట్ నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎలా పాటించాలి?

20-20-20 నియమం: ఈ సమస్యలను నివారించడానికి నిపుణులు ఒక సులభమైన చిట్కా ఇస్తున్నారు. అదే 20-20-20 నియమం. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.

సరైన వెలుతురు: తగినంత వెలుతురు ఉన్న చోట పనిచేయడం వల్ల కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం.

స్క్రీన్ సమయం తగ్గించండి: అనవసరమైన స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అప్పుడప్పుడు స్క్రీన్ నుంచి విరామం తీసుకోవడం వల్ల కేవలం కళ్ళకు విశ్రాంతి లభించడమే కాదు, పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీరు కూడా ఈ డిజిటల్ ఉపవాసాన్ని పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.