గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడా ఇదే! ఏది ప్రమాదమో ఎలా గుర్తించాలంటే…

గుండెలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది భయపడతారు. అది గుండె పోటు అనుకొని ఆందోళన పడతారు. అయితే, ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండె పోటు కాకపోవచ్చు. కొన్నిసార్లు గ్యాస్ వల్ల కూడా అలాంటి నొప్పి రావచ్చు. గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది భయపడతారు. అది గ్యాస్ నొప్పి కావచ్చా లేక గుండెపోటా అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ఈ రెండింటి లక్షణాలు కొన్నిసార్లు ఒకేలా ఉన్నా, వాటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.


గ్యాస్ నొప్పి లక్షణాలు

గ్యాస్ నొప్పి సాధారణంగా పొట్ట పైభాగంలో లేదా ఛాతీలో వస్తుంది. ఈ నొప్పి ఒకచోట స్థిరంగా ఉండదు. గుండె ప్రాంతం నుంచి కడుపు వరకు, వెన్ను భాగం వరకు తిరుగుతూ ఉంటుంది. ఈ నొప్పి భోజనం చేసిన తర్వాత లేదా అజీర్ణం అయినప్పుడు వస్తుంది. అపానవాయువు బయటకు వదలిన తర్వాత లేదా తేన్చిన తర్వాత ఈ నొప్పి తగ్గుతుంది. ఈ నొప్పి తీవ్రతలో మార్పులు చూపిస్తుంది. కొన్నిసార్లు తీవ్రంగా, మరోసారి మందంగా ఉంటుంది. పొట్టపై ఒత్తిడి కలిగించినప్పుడు లేదా కదిలినప్పుడు నొప్పి ఎక్కువ కావచ్చు.

గుండె నొప్పి లక్షణాలు

గుండె నొప్పి గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు వస్తుంది. ఈ నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు వస్తుంది. ఇది తీవ్రంగా, నిరంతరంగా ఉంటుంది. నొప్పి తరచుగా భుజాలు, మెడ, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది. గుండె నొప్పి శారీరక శ్రమ, ఒత్తిడి లేదా ఆందోళన వల్ల ఎక్కువ అవుతుంది. విశ్రాంతి తీసుకున్నప్పుడు లేదా మందులు వాడినప్పుడు తగ్గుతుంది. గుండె నొప్పితో పాటు ఊపిరి ఆడకపోవడం, చెమట పట్టడం, తలతిరగడం, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

తేడాలు

నొప్పి స్థానం: గ్యాస్ నొప్పి పొట్టపై, ఛాతీ ఎగువ భాగంలో మొదలవుతుంది. గుండె నొప్పి ప్రధానంగా ఛాతీ మధ్యలో లేదా ఎడమవైపు వస్తుంది.

నొప్పి స్వభావం: గ్యాస్ నొప్పి ఆగి ఆగి వస్తుంది. గుండె నొప్పి సాధారణంగా ఒకే తీరులో ఉంటుంది.

నొప్పికి ఉపశమనం: గ్యాస్ బయటకు వెళ్లిన తర్వాత గ్యాస్ నొప్పి తగ్గుతుంది. గుండె నొప్పికి విశ్రాంతి లేదా మందులు మాత్రమే ఉపశమనం ఇస్తాయి.

ఇతర లక్షణాలు: గుండె నొప్పితో పాటు శ్వాస ఆడకపోవడం, చల్లని చెమటలు వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. గ్యాస్ నొప్పికి ఈ లక్షణాలు ఉండవు.

ముఖ్య గమనిక: ఇది కేవలం ఇంటర్నెట్ లో లభించిన సమాచారం మాత్రమే. మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.