వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ..! షర్మిల కీలక ప్రకటన

పీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా ప్రస్తుతం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు. అయితే జగన్ కూ, ఆయన సోదరి వైఎస్ షర్మిలకూ మధ్య రాజకీయంగా అస్సలు పొసగడం లేదు.


ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ఎంట్రీ చేయించేందుకు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ తొలి అడుగు వేశారు. ఈ మేరకు కర్నూలుకు తీసుకెళ్లి మరీ రాజారెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు.

ఇన్నాళ్లూ వైఎస్ షర్మిల కుమారుడిగా, తల్లిచాటు బిడ్డగా ఉన్న వైఎస్ రాజారెడ్డికి ఉన్నత విద్యావంతుడిగా, తన పని తాను చేసుకుపోతాడనే పేరుంది. వైఎస్ కుటుంబం నుంచి వచ్చినా రాజకీయంగా ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్ గా ఉంటూ వస్తున్న రాజారెడ్డిని ఉన్నట్లుండి రాజకీయాల్లోకి తీసుకురావాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ అకస్మాత్తుగా తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం ఇప్పించి మరీ కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతుల్ని కలిసేందుకు రాజారెడ్డిని షర్మిల తీసుకెళ్లారు.

కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతుల్ని పరామర్శించే సమయంలోనూ తన కుమారుడు రాజారెడ్డిని పక్కనే నిలబెట్టిన షర్మిల.. ప్రత్యేకంగా ఎలాంటి పరిచయం కూడా చేయలేదు. అయితే చివర్లో రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసమే తీసుకుని వచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడంటూ షర్మిల తేల్చిచెప్పేశారు.

ఇప్పటికే మామ వైఎస్ జగన్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ రాజారెడ్డి.. షర్మిల కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారతారా లేక సొంత పార్టీ పెట్టి ముందుకువెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. జగన్ కు ఇద్దరూ కూతుళ్లే కావడం, షర్మిల కుమారుడు రాజారెడ్డికి కలిసి రానుంది. వైఎస్ కుటుంబ వారసుడిగా రాజారెడ్డిని ముందుకు తెచ్చేందుకు షర్మిలకు అవకాశం దక్కుతోంది. అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.