రోడ్డుపై వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి కేసుల్లో మరింత కఠిన చర్యలు తీసుకుంటారు.
ఒకవేళ వాహనదారులు ‘నో పార్కింగ్ జోన్’లో వాహనం నిలిపితే.. పోలీసులు ఆ వాహనాలను స్టేషన్‌కి తరలిస్తారు. యజమాని జరిమానా చెల్లించి, సరైన పత్రాలు చూపించిన తర్వాత మాత్రమే వాహనాన్ని తిరిగి పొందగలుగుతాడు.
కొంతమంది యజమానులు జరిమానాలు చెల్లించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం వంటి కారణాలతో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇలాంటి వాహనాలను కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఎవరూ స్టేషన్ కు వచ్చి తీసుకోకపోతే.. పోలీసులు అధికార ప్రకటనల ద్వారా వేలం నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, నిర్ణీత నిబంధనల ప్రకారం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. మార్కెట్లో లభించే రేట్ల కంటే కూడా ఇక్కడ తక్కువ ధరలకే వాటిని దక్కించుకునే అవకాశం ఉంటుంది.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్‌లో స్వాధీనం చేసిన ఆరు వాహనాలను వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జి. జనార్థన్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది.
వేలంలో ఉండే వాహనాలు..
ఈ వేలంలో బజాజ్ ఆటో, హీరో హోండా ప్యాషన్ ప్రో, హోండా షైన్ CB 125, హీరో స్ప్లెండర్ ప్లస్, కెటిఎమ్ బైక్, హెచ్ఎఫ్ డీలక్స్ వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి కండీషన్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
వేలంలో పాల్గొనేవారి విధానం..
వేలంలో పాల్గొనదలచిన వారు 25 శాతం ఈఎండి చెల్లించి రసీదు తీసుకోవాలి. ఇది వేలం వేసే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకుంటారు. వేలంలో మీకు ఎలాంటి వాహనం రాకపోతే.. ఈ డబ్బులను మళ్లీ తిరిగి ఇచ్చేస్తారు. అనంతరం బహిరంగ వేలం బుధవారం జరుగుతుంది. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం పని వేళల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
































