ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానికి బయలుదేరి వెళ్లిన ఆయన అక్కడ పలువురు కేంద్రమంత్రులతో సమావేశమౌతోన్నారు.
రాష్ట్రానికి కావాల్సిన, రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి వారితో చర్చిస్తోన్నారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి కొన్ని కీలక ప్రతిపాదనలను అందజేశారు రేవంత్.
హైదరాబాద్ లో నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ-ఏపీ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు సముద్ర రేవు లేనందున, బందరు పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో మిగతా భాగం ఏపీలో ఉంటుందని వివరించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్- నార్త్ ఫేజ్ 90 శాతం భూ సేకరణ పూర్తయినందున వెంటనే ఆర్థికపరమైన, కేంద్ర మంత్రిమండలి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆర్ఆర్ఆర్- నార్త్ సమాంతరంగా ఆర్ఆర్ఆర్- సౌత్ పనులు చేపట్టాలని, అందుకు వెంటనే అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్‌ను ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించే మన్ననూర్ – శ్రీశైలం రహదారి అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఉన్నందున 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఏపీలోని కృష్ణపట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరులకు రాకపోకలు సులభతరమౌతాయని చెప్పారు. రావిర్యాల – ఆమన్‌గల్ – మన్ననూర్ 4 లేన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించాలని కోరారు.
హైదరాబాద్ – మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున దీనికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్లతో పంపిన రహదారుల పనులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ – అమరావతి – బందరు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్‌కు పంపుతానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తామని రేవంత్ వివరించారు.
































