తెలంగాణలో కొత్త విధానం..నిమిషంలోనే కుల ధ్రువీకరణ

వతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సులభతరం చేసింది. గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న నిమిషంలోనే సర్టిఫికెట్ జారీ చేసే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.


ఈ విధానం ద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

గత 15 రోజులుగా ఈ నూతన విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉందని, ఇప్పటికే 17,500 మందికి పైగా లబ్ధిదారులు తక్షణమే తమ కుల ధ్రువపత్రాలను అందుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ విధానం వల్ల ఏటా సుమారు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన అంచనా వేశారు. ఇకపై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు కొత్త సర్టిఫికెట్ కోసం ప్రతిసారీ అధికారుల ఆమోదం కోసం వేచి చూడాల్సిన పనిలేదు. గతంలో తీసుకున్న సర్టిఫికెట్ నంబర్ తెలిస్తే, దాని ఆధారంగా వెంటనే కొత్త పత్రాన్ని పొందవచ్చు.

ఒకవేళ పాత నంబర్ అందుబాటులో లేకపోయినా, జిల్లా, మండలం, గ్రామం, పేరు వంటి వివరాలతో శోధించి సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. అయితే, పేరు, ఇంటిపేరు వంటి మార్పులు అవసరమైతే మాత్రం జిల్లా అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ ఎస్సీ వర్గం నుంచి క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ సర్టిఫికెట్ పొందాలనుకునే వారికి మాత్రం పాత ఆమోద ప్రక్రియే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.