తెలంగాణ, ఆంధ్రా ప్రజలకు శుభవార్త.. ఇక హైదరాబాద్ నుంచి అమరావతికి రెండు గంటలే ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐదు నుంచి ఆరు గంటలు ప్రయాణిస్తేనే చేరుకుంటాం. మరి అతి తక్కువ సమయంలో చేరుకునే సమయం దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తున్నది.


ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాలను కలుపుతూ చేపట్టే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో ముందడుగు పడింది. తొలుత ఆరు నుంచి 8 లేన్ల మేర నిర్మించి, భవిష్యత్తు దృష్ట్యా 12 లేన్లకు విస్తరించే అవకాశం ఉన్నది.

ఈ రోడ్డుకు సంబంధించి అలైన్‌మెంట్ దాదాపు ఖరారైనట్టుగా తెలిసింది. ఈ నూతన రోడ్డు అందుబాటులోకి వస్తే మాత్రం హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి కేవలం రెండు గంటలకే చేరుకోవచ్చు. ఇప్పుడున్న జాతీయ రహదారి కంటే 57 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల రహదారిగా నిర్మాణం చేపట్టనున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ముచ్చర్లలో ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి విజవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా మీదుగా ఈ రహదారి నిర్మాణం సాగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి సమీపంలోని అమరావతికి చేరుకుంటుంది. అక్కడి నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ రోడ్డును అనుసంధానిస్తారు.

ఈ ఎక్స్‌ప్రెస్ వే మొత్తం 297.82 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డు తెలంగాణ రాష్ట్ర పరిధిలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డును అనుసరించి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కిలోమీటర్ల దూరమే అవుతుంది. ఇది ప్రస్తుత రోడ్డుతో పోలిస్తే 57 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. దీని భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.