ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి కీలకంగా పనిచేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుల సౌకర్యాన్ని కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం, దీపం 2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
దీపం 2.0 పథకంతో వారికి లబ్ది
“దీపం-2 పథకం” కింద గిరిజన కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించడానికి నిర్ణయించిన ఏపీ సర్కార్ అందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 16 జిల్లాలకు చెందిన 23,912 మంది గిరిజనుల కుటుంబాలకు లబ్ధి జరగనుంది. దీనికోసం ప్రభుత్వం 5. 54 కోట్ల రూపాయలను కేటాయించి వారికి ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించనుంది.
ఏడాదికి వారికి మూడు గ్యాస్ సిలిండర్లు
ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారికి సంవత్సరానికి మూడు 14.2కిలోల గ్యాస్ సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో గిరిజన ప్రాంతాలలో ఉన్న వారు 5కిలోల గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారిని దీపం పథకం నుంచి మినహాయించారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ వారికి కూడా దీపం 2 పథకాన్ని అందించాలని, ఈ సమస్యను పరిష్కరించడానికి 14.2కిలోల సిలిండర్లను అందించాలని ప్రతిపాదించింది.
రాష్ట్ర వ్యాప్తంగా వారికి దీపం 2 పథకం
రాష్ట్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీనిపైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ పథకం అమలుకు సంబంధించి కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు గ్యాస్ కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ఇలా చేస్తే దీపం 2 పథకం ద్వారా లబ్ది
లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధిని పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలని చెబుతున్నారు. ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఒకదానికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని చెబుతున్నారు. దీనికోసం ఈ కేవైసీ పూజ చేయడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
నేరుగా ఉచిత సిలిండర్ లు ఇవ్వనున్న ప్రభుత్వం
అయితే ప్రస్తుతం లబ్ధిదారులు సిలిండర్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి ఆ తర్వాత ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలో వేసే రాయితీ డబ్బుల కోసం మహిళలు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి నేరుగా ఉచిత సిలిండర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
దీపం 2 పథకంలో సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్
ఇక దీపం 2 పథకంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే, సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా గ్రామ/ వార్డు సచివాలయాలను సంప్రదించి సమాచారాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా దీపం 2.0 పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































