కాల్పుల విరమణపై ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు దోహాలోనే జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్యసమితి, ఖతార్ సహా చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ఈ దాడి గురించి ఇజ్రాయెల్ తనకు తెలియజేసిందని, కానీ, ”ఈ దురదృష్టకరమైన ఘటన జరగకుండా అడ్డుకోవడం అప్పటికే ఆలస్యమైనట్లు”అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
మరోపక్క ఇజ్రాయెల్‌కు అందిస్తోన్న ద్వైపాక్షిక మద్దతును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ దాడి తర్వాత యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చెప్పారు.
ఇజ్రాయెల్ దాడుల తర్వాత పరిస్థితులపై చర్చించేందుకు అరబ్, ఇస్లామిక్ దేశాలతో దోహాలో ఖతార్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.
ఖతార్ అధికారిక వార్తా సంస్థ ప్రకారం.. సెప్టెంబర్ 14,15 తేదీల్లో ఈ రెండు రోజుల సమావేశం జరగనుందని తెలిసింది.
అద్భుత ప్రయాణం
ఒక ఆధునిక, సంపన్న దేశంగా మారిన ఖతార్, శతాబ్దం క్రితం 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉండేది. కానీ ఈ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండేది కాదు.
ఇక్కడ నివసించే వారిలో చాలామంది మత్స్యకారులు, ముత్యాలను వెలికితీసేవారే ఉండేవారు. ఇక్కడి జనాభాలో చాలా మంది సంచారజీవులే.
అయితే 1930, 1940ల్లో జపాన్ కూడా ముత్యాల సాగు (పర్ల్ ఫార్మింగ్) ప్రారంభించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పెనుఘాతంగా మారింది.
ఈ సమయంలో 30 శాతం జనాభా ఖతార్ నుంచి వలస వెళ్లిపోయింది.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం.. ఖతార్ జనాభా 1950లో 24 వేలకు పడిపోయింది.
అప్పుడు ఖతార్ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది.
దీన్ని విప్లవం అనడానికి మించి, ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పొచ్చు.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను ఖతార్ కనుగొంది.
1950ల నుంచి ఖతార్ ఖజానాలు గలగలలాడటం మొదలు పెట్టాయి.
ఆ తర్వాత కొద్దికాలానికే ఈ దేశంలోని కొందరు పౌరులు ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాల్లో కూడా చోటు దక్కించుకున్నారు.
నేడు ఖతార్‌లో లెక్కలేనని ఆకాశ హర్మ్యాలు, అద్భుతమైన కృత్రిమ దీవులు, అధునాతన స్టేడియాలు వెలిశాయి.
ఖతార్ ప్రపంచంలో సంపన్న దేశంగా మారేందుకు సహకరించిన ఆర్థిక వ్యవస్థలోని మూడు మార్పుల గురించి తెలుసుకుందాం..
1939లో చమురు కనుగొనడం
ఖతార్‌లో చమురును కనుగొన్నప్పుడు, స్వాతంత్య్ర దేశంగా లేదు.
1916 నుంచి ఖతార్ బ్రిటీష్ వారి నియంత్రణలో ఉండేది.
అయితే, ఖతార్‌లో తొలిసారి చమురు నిల్వలను 1939లో దేశంలో పశ్చిమ తీర ప్రాంతమైన దుఖాన్‌లో కనుగొన్నారు.
ఇది దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
” రెండవ ప్రపంచ యుద్ధానికి కాస్త ముందు ఈ నిల్వలను కనుగొన్నారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1949 వరకు చమురు ఎగుమతులు నిలిచిపోయాయి” అని అమెరికాలోని బ్యాంకర్ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన ఖతార్ వ్యవహారాల నిపుణులు క్రిస్టియన్ కోట్స్ చెప్పారు.
చమురు ఎగుమతులు ఖతార్‌కు లెక్కలేనన్ని అవకాశాలను అందించాయి. అప్పటి నుంచే వేగవంతమైన మార్పులు కనిపించాయి.
అభివృద్ధి చెందుతోన్న చమురు పరిశ్రమపై ఆకర్షితులైన ఇన్వెస్టర్లు, వృత్తిపరమైన నిపుణులు ఖతార్‌కు వెళ్లడం ప్రారంభించారు. దీంతో, ఆ దేశంలో జనాభా పెరిగింది.
1950లో ఖతార్ జనాభా 25 వేల కంటే తక్కువగా ఉండేది. కానీ, 1970 నాటికి ఈ జనాభా లక్షకు పైగా పెరిగింది.
ఆ తర్వాత ఏడాదిలో అంటే 1971లో బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన ఖతార్, స్వాతంత్య్ర దేశంగా ఏర్పడింది.
ఈ సరికొత్త యుగం ప్రారంభమైన తర్వాత, ఖతార్ మరింత సంపన్న దేశంగా మారింది.
అదే సమయంలో ఖతార్‌లో మరో సహజ వనరును వెలికి తీశారు.
సహజ వాయువు అన్వేషణ
ఖతార్‌లోని ఈశాన్య తీర ప్రాంతమైన నార్త్ ఫీల్డ్‌లో 1971లో ఇంజనీర్లు పెద్ద మొత్తంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నప్పుడు, కొంతమంది వ్యక్తులు మాత్రమే వీటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్నారు.
భూమిపై ఉన్న అతిపెద్ద నాన్-అసోసియేటెడ్ గ్యాస్ ఫీల్డ్ నార్త్ ఫీల్డేనని అర్థం చేసుకునేందుకు 14 ఏళ్లు పట్టింది. ప్రపంచ రిజర్వులలో 10 శాతం ఈక్షేత్రంలోనే ఉన్నాయి.
నార్త్ ఫీల్డ్ 6 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఖతార్ పరిమాణంతో పోలిస్తే సగానికి సమానం.
ప్రపంచంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను (ద్రవ సహజ వాయువు) ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది ఖతార్ గ్యాస్ కంపెనీనే. ఖతార్ ఆర్థికాభివృద్ధిలో ఖతార్ గ్యాస్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.
కానీ, చమురు మాదిరి కాకుండా.. సహజ వాయువు నుంచి ఆదాయం రావడానికి కాస్త సమయం పట్టింది.
”చాలా కాలం దీనికంత డిమాండ్ రాలేదు. కానీ, 80 దశకంలో ప్రతీది మారడం మొదలైంది” అని క్రిస్టియాన్ కోట్స్ చెప్పారు.
” 1990ల్లో సహజ వాయువు ఎగుమతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత ఎగిసింది” అని తెలిపారు.
21వ శతాబ్ధంలో దూసుకెళ్లిన ఖతార్
21వ శతాబ్దంలో ఖతార్ ఆర్థికాభివృద్ధి రేటు గ్రాఫ్ మరింత పైకి ఎగిసింది.
2003 నుంచి 2004 మధ్య కాలంలో ఖతార్ జీడీపీ గ్రోత్ రేటు 3.7 శాతం నుంచి 19.2 శాతానికి పెరిగింది.
ఆ తర్వాత రెండేళ్లకు 2006లో 26.2 శాతానికి ఇది దూసుకెళ్లింది.
పెరుగుతోన్న ఈ జీడీపీ రేటు చాలా ఏళ్ల పాటు ఖతార్ వృద్ధికి ఒక హాల్‌మార్కుగా నిలిచింది. ఈ గ్రోత్ కేవలం గ్యాస్ ధరలకు మాత్రమే పరిమితం కాలేదు.
” దేశంలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నప్పుడే ఈ ఆర్థిక మార్పులు కూడా జరిగాయి. ప్రస్తుత ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని తండ్రి హమద్ బిన్ ఖలీఫా అల్ థాని 1995లో అధికారంలోకి వచ్చారు. అధికార మార్పిడి జరిగిన పద్ధతి ఇప్పటికీ చాలామంది దృష్టిలో వివాదాస్పదమే” అని ఖతార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సస్టైనబుల్ ఎకనామిక్స్ నిపుణులు మొహమ్మద్ సయీదీ చెప్పారు.
తన తండ్రి స్విట్జర్లాండ్‌లో ఉండగా హమద్ బిన్ ఖలీఫా అల్ థాని ఆయన బదులు అధికారాన్ని చేపట్టారు.
అల్ థాని కుటుంబం ఖతార్‌ను 150 ఏళ్లుగా పాలిస్తోంది. ఈ పద్ధతిలో కుటుంబ సభ్యుల మధ్య అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి కాదు.
అయితే, రాజకుటుంబం కుట్రలను పక్కన పెడితే, అధికార మార్పిడి ఖతార్‌లో కీలక మార్పును తీసుకొచ్చినట్లు నిపుణులు భావిస్తారు.
” సహజ వాయువును, చమురును వెలికి తీసి, ఎగుమతి చేసేందుకు ఖతార్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు ఈ విస్తారమైన నిక్షేపాల పనితీరును మరింత మెరుగుపరిచాయి. దీంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి” అని స్పానిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పేర్కొంది.
జపాన్‌కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను తీసుకెళ్లేందుకు 1996లో ఒక నౌక బయలుదేరింది. ఇదే ఖతార్ తొలి సహజ వాయువు ఎగుమతి. మల్టి బిలియన్ డాలర్ ఇండస్ట్రీకి ఇదే మొదలు.
2021లో ఖతార్ తలసరి జీడీపీ 61,276 డాలర్లు (సుమారు రూ.54 లక్షలు పైన). కొనుగోలు శక్తి రీత్యా చూస్తే ఇది 93,521 డాలర్లకు (సుమారు రూ.81 లక్షల పైకి) ఎగిసింది. ప్రపంచంలో ఇదే అత్యధికమని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఖతార్‌లోని తక్కువ జనాభానే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఖతార్ జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే. దానిలో చాలామంది వలసదారులే.
ఖతార్ ఆర్థిక వ్యవస్థలోని సవాళ్లు
ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఇటీవల కాలంలో కాస్త ఇబ్బందులు పడుతోంది.
పెట్రోలియం ఉత్పత్తులపైనే ఇది ఆధారపడటంతో భవిష్యత్‌కు అతిపెద్ద సవాలుగా మారింది.
అదే సమయంలో పర్యావరణ ప్రభావ విషయంలో ఖతార్ ప్రస్తుతం కఠినమైన పర్యవేక్షణను ఎదుర్కొంటోంది.
అత్యంత ఎక్కువ గ్రీన్‌హౌస్ గ్యాస్‌లను విడుదల చేస్తోన్న దేశాలలో ఖతార్ ఒకటి.
2017 నుంచి 2021 మధ్య కాలంలో సౌదీ అరేబియా, యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్‌లు దౌత్యపరమైన విభేదాలతో ఖతార్‌ను దిగ్భంధించాయి.
ఈ దిగ్భందంతో ఖతార్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
భారత్‌తో సంబంధాలు
ఖతార్‌తో భారత్ దౌత్య సంబంధాలు 1973లో ప్రారంభమయ్యాయి. ఈ వారంలో దోహాపై ఇజ్రాయెల్ చేసిన దాడిని భారత్ కూడా ఖండించింది.
” ఈ సంఘటనపై, దానివల్ల ఈ ప్రాంతంపై పడే ప్రభావంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో సంయమనం పాటించాలి. దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనాలి” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో భారత ప్రధాని మోదీని కలిశారు.
రెండు దేశాల మధ్య ఇంధనం, పెట్రోకెమికల్స్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్యం, ఐటీ వంటి రంగాల విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి.
దీనికి ఏడాది ముందు 2024లో మోదీ ఖతార్ వెళ్లారు. పహల్గాం దాడి తర్వాత, ఇరు దేశాల నేతల మధ్యలో ఫోన్‌లో సంభాషణ జరిగింది. ఖతార్‌కు మూడు అతిపెద్ద ఎగుమతి భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటి.
































