ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు.. నారా దేవాన్ష్ అంతర్జాతీయ వేదికపై ఒక అరుదైన ఘనత సాధించారు. కేవలం 10 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుత ప్రతిభ కనబరిచి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఈ ఘనతకు గాను లండన్‌లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో దేవాన్ష్‌కు ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ స్వయంగా హాజరై తన కుమారుడి విజయాన్ని చూసి ఎంతో ఆనందించారు.
రికార్డు..
గత ఏడాది జరిగిన ‘చెక్ మేట్ మారథాన్’ పోటీలో దేవాన్ష్ ఈ అసాధారణ రికార్డును నెలకొల్పాడు. ప్రఖ్యాత చెస్ గ్రాండ్‌మాస్టర్ లాస్లో పోల్గార్ రాసిన “5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్, అండ్ గేమ్స్” అనే పుస్తకంలో నుంచి తీసుకున్న 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ అత్యంత వేగంగా పరిష్కరించాడు. ఈ పజిల్స్‌ను పరిమిత సమయంలో పూర్తి చేయడం ద్వారా దేవాన్ష్ అసాధారణమైన మేధాశక్తిని ప్రపంచానికి నిరూపించాడు.
ఈ క్రమంలోనే కుమారుడి విజయం పట్ల తండ్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో దేవాన్ష్ ఈ గౌరవాన్ని అందుకోవడం నిజంగా చాలా ప్రత్యేకమైన సందర్భం. పదేళ్ల వయసులోనే ముందుచూపుతో ఆలోచించడం, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, ఆట పట్ల పూర్తి అంకితభావం చూపడం అతని విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. ఒక తండ్రిగా, అతను గంటల తరబడి చేసిన కఠోర శ్రమను నేను కళ్లారా చూశాను. అతని కష్టానికి దక్కిన నిజమైన ప్రతిఫలం ఈ గుర్తింపు. మేమందరం అతని గురించి చాలా గర్వపడుతున్నాం” అని అన్నారు.
ఇక దేవాన్ష్ సాధించిన ఈ రికార్డుతో పాటు, గతంలో కూడా ఆయన మరో రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఏడు డిస్క్‌ల ‘టవర్ ఆఫ్ హనోయి’ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేయడం.. అలాగే 9 చెస్ బోర్డులను 32 పావులతో కేవలం 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చడం ద్వారా కూడా ఆయన రికార్డులు నెలకొల్పాడు. దేవాన్ష్ విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

































