తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అనేక ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. రైళ్లు.. బస్సులు అన్నీ ప్రతీ రోజు రద్దీగానే ఉంటాయి.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్రం – రాష్ట్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలు ప్రయాణీకులకు వరంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు కొనసాగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అదే విధంగా తిరుపతి బస్సు స్టేషన్.. సౌకర్యాల పెంపు పైన సీఎం చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసారు.
భక్తుల కోసం
తిరుపతిలో పెరుగుతున్న యాత్రికుల రద్దీకి అనుగుణంగా అత్యాధునిక బస్‌స్టేషన్ నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా, సౌకర్యంగా ఉండేలా నిర్మించనుంది. ఒకేసారి 150 బస్సులు నిలిపేందుకు వీలుగా బస్ బేతో పాటు రెండు ఎంట్రీలు, రెండు ఎగ్జిట్లు, ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ సౌకర్యం, అందుకు సరిపడా విద్యుత్తు కోసం సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. తిరుపతికి వచ్చే భక్తులు, బస్సుల సంఖ్య, ప్రస్తుత బస్టాండ్ సామర్థ్యం గురించి చర్చించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే కొత్త బస్ స్టేషన్‌కు సంబంధించిన ఐదు నమూనాలను సీఎం పరిశీలించారు.
భారీ డిజైన్లతో
హెలిప్యాడ్, రోప్‌వే, కమర్షియల్ మాల్స్, మల్టీప్లెక్స్ లతో డిజైన్లు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు ఆధునికీకరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో తిరుపతి రైల్వే స్టేషన్ పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రాను న్నాయి. నిత్యం లక్షన్నర మందికి పైగా భక్తులుమరింత సులభంగా.. అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం, భవన నిర్మాణం ప్రారంభం కాగా.. ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణ వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. రాబోయే రెండు నెలల కాలంలో ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఏయిర్ పోర్టు తరహాలో
తిరుపతిలో సౌత్ సైట్ స్టేషన్ బిల్డింగ్ తోపాటు జీ ప్లస్ త్రీ భవనంలో ఎయిర్ కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్‌లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియా తో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్ కాన్ కోర్స్ రానున్నాయి. బేస్మెంట్ లో 200 ఫోర్ వీలర్స్, 300 కు పైగా టూ వీలర్స్ కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సేవరేజ్ ట్రీట్మెం ట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరగనున్నాయి. దక్షిణం వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. ఇలా, రైల్వే – బస్ స్టేషన్ల పైన రెండు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ చేయటంతో.. భక్తులకు వెసులుబాటు కలగనుంది.































