మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు సరిగా పని చేయడం చాలా అవసరం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, భావోద్వేగ స్థిరత్వం.. ఇవన్నీ మెదడు పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి.
సరైన ఆహారం, జీవనశైలి లేకపోతే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మెదడును బలంగా ఉంచడానికి, దాని సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. మెదడు ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు కూడా ముఖ్యమైనది. మెదడును చురుగ్గా ఉంచేందుకు ఏ ఆహారాలు ఉత్తమం, ఏవి ప్రమాదకరం అనేది ఇప్పుడు చూద్దాం.
మెదడుకు మంచి ఆహారాలు
సాల్మన్ చేప: ఇందులో DHA అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడులోని నరాలను పునరుద్ధరించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
బ్లూబెర్రీస్: వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులో వాపును తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
అవకాడో: ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు కణాలు, రక్తప్రసరణకు ఎంతో మేలు చేస్తాయి.
గుడ్లు: గుడ్లలో కోలిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి, మెదడులోని సంకేతాలను పంపే న్యూరోట్రాన్స్మిటర్లకు చాలా అవసరం.
ఆలివ్ నూనె: ఇందులో ఉండే పాలీఫెనాల్స్ మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
ఆకుకూరలు: పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
మెదడుకు హానికరమైన ఆహారాలు
చక్కెర పానీయాలు: సోడా, షుగర్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మెదడును అలసిపోయేలా చేసి, ఏకాగ్రతను తగ్గిస్తుంది.
అధిక ఒమేగా-6 ఉన్న నూనెలు: సన్ఫ్లవర్ ఆయిల్ వంటి కొన్ని నూనెల్లో ఉండే ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మెదడులో వాపును పెంచుతాయి.
ప్రాసెస్ ఫుడ్స్ : ప్యాకెట్లలో దొరికే స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటివాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, అడిటివ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు హాని చేస్తాయి.
ఏం చేయాలి..?
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, బెర్రీలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి.
ఆహారంతో పాటు మెదడుకు ధ్యానం , తగినంత నిద్ర చాలా అవసరం. ఇవి మెదడును ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)




































