మన దేశంలో రైళ్లలో రద్దీ మామూలుగా ఉండదు. సీట్లు దొరకడం చాలా కష్టం. ఇక పండుగలు వచ్చాయంటే నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మన దేశంలో అత్యధిక మంది ప్రయాణించేది రైల్లోనే. దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఉండడం, అతి ధరలే దీనికి కారణం. రోజుకు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అటు రైల్వే శాఖ సైతం ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తగిన మార్పులు, రూల్సు తీసుకొస్తుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్డేట్‌గా చెప్పొచ్చు. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. అక్రమ బుకింగ్‌లను అరికట్టి, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు లభించేలా చేయడానికి రైల్వే బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనలు ఎలా పని చేస్తాయి?
ఏదైనా రైలుకు టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోగలరు. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లలో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు సాధారణ రిజర్వేషన్లకు కూడా దీనిని వర్తింపజేస్తున్నారు. బుకింగ్ ప్రారంభం కాగానే సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి అక్రమంగా టికెట్లను బుక్ చేసేవారిని నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ మార్పు వల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికే అవకాశం పెరుగుతుంది.
ఎప్పటి నుంచి..?
ఈ కొత్త విధానం అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ సమయాలలో ఎటువంటి మార్పు ఉండదు రైల్వే బోర్డు ఈ నిర్ణయం వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుతుందని తెలిపింది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు ఇప్పటికే సమాచారం అందించింది. రైల్వే ప్రయాణాలను మరింత సమర్థవంతంగా, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రైల్వే అధికారులు తెలిపారు.
































