ఎంతో ఖర్చు పెట్టి కారు కొంటారు. కానీ, దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు చాలామంది. అయితే కేవలం ఏడు ముఖ్యమైన టిప్స్ పాటించడం ద్వారా కారు పాడవ్వకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు నిపుణులు. కారు ఎక్కువకాలం పాటు పాడవ్వకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కారు కొన్న తర్వాత దాన్ని చక్కగా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే సర్వీస్ లో భాగంగా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఖర్చు తగ్గించుకునేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే బెస్ట్. ముఖ్యంగా కారులో ఈ 7 పార్ట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
1. ఇంజిన్ ఆయిల్
ఇంజిన్ ఆయిల్ అనేది కారుకు గుండె వంటిది. ప్రతి 10,000 కిలోమీటర్లకు లేదా ఒక సంవత్సరానికి ఇంజిన్ ఆయిల్ ను తప్పక మార్చాలి. ఇంజిన్ ఆయిల్ పాడయితే.. ఇంజిన్ పిస్టన్స్ లో రాపిడి పెరిగి ఇంజిన్ త్వరగా పాడవుతుంది. తద్వారా ఎక్కువ ఫ్యుయెల్ ను తాగుతుంది.
2. బ్రేక్స్
ప్రతి మూడు నెలలకోసారి లేదా సర్వీస్ చేయించేటప్పుడు కారు బ్రేక్ ప్యాడ్లు కండిషన్ లో ఉన్నాయో లేదో చెక్ చేయించాలి. అలాగే బ్రేక్ ఆయిల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. బ్రేక్ ఆయిల్‌ను సకాలంలో మార్చడం ద్వారా బ్రేక్స్ కరెక్ట్ గా పడతాయి. బ్రేక్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
3. టైర్ ప్రెజర్
ప్రతి 15 రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయడం చాలా ముఖ్యం. కారు టైర్లు కండిషన్ లో లేకపోయినా , ప్రెజర్ తక్కువగా ఉన్నా.. కారు మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ పై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి టైర్స్ ను టైర్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం.
4. రేడియేటర్
కారు ఇంజిన్ వేడెక్కితే ఉన్నట్టుండి కారు బ్రేక్ డౌన్ అవ్వొచ్చు. కాబట్టి కూలంట్ ఆయిల్, రేడియేటర్, వాటర్ లెవల్స్ ను ప్రతీ ట్రిప్ లోనూ చెక్ చేసుకోవాలి. సమయానికి కూలెంట్‌ను మార్చడం, రేడియేటర్‌ను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం.
5. బ్యాటరీ
ట్రిప్ కు వెళ్లే ముందు కారు బ్యాటరీలు కండిషన్ లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. కారు లైట్లు, హారన్, సెల్ఫ్ స్టార్ట్ వంటివి బ్యాటరీ మీదే ఆధార పడి పని చేస్తాయి. కాబట్టి బ్యాటరీలు ఛార్జ్ అవుతూ ఉండడం ముఖ్యం. బ్యాటరీ లైఫ్ అయిపోతే సకాలంలో వాటిని మార్చి కొత్తవి పెట్టుకోవాలి.
6. ఎయిర్ ఫిల్టర్
ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే కారు పనితీరును తగ్గుతుంది. అలాగే ఎక్కువ పెట్రోల్ ను తీసుకుంటుంది. కాబట్టి ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ను చెక్ చేసుకోండి.
7. సర్వీస్
కారు బాగానే నడుస్తుంది కదా అని టైం టు టైం సర్వీస్ చేయించకుండా ఉండకూడదు. కారులో మనకు తెలియని రిపేర్లు ఏమైనా ఉంటే అవి సర్వీస్ లోనే బయటపడతాయి. కాబట్టి కారు ఎక్కువకాలం పాటు సక్రమంగా నడవాలంటే.. టైం టు టైం సర్వీస్ చేయించడం మస్ట్ .
































