డబ్బు ఆదా చేయాలని అందరికీ ఉంటుంది. కానీ దాన్ని పక్కాగా ఎలా అమలు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఈ విషయంలో జపనీస్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తారు. డబ్బు ఆదా చేయడం కోసం జపాన్లో ‘కకేబో’ అనే టెక్నిక్ ను ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ తో జాగ్రత్తగా ఖర్చు చేయడంతో పాటు అవసరాలకు డబ్బు ఎలా కేటాయించుకోవాలో తెలుస్తుంది.
కకెబో అంటే..
కకేబో అంటే జపనీస్ లో ‘పద్దు పుస్తకం’ అని అర్థం. ఇది మన కల్చర్ లో ఎప్పట్నుంచో ఉన్నా.. దాన్ని ఫాలో అయ్యేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ర్యాండమ్ గా ఖర్చు పెట్టకుండా ఒక పుస్తకంలో మన ఇంటి ఖర్చులు,ఆదాయాలు రాసుకోవడమే ఈ టెక్నిక్ ముఖ్య ఉద్దేశం. ఇదే టెక్నిక్ ఇప్పుడు అమెరికాలో కూడా చాలా పాపులర్ అవుతోంది. ఈ పుస్తకంలో ఖర్చులు, పొదుపు లక్ష్యాలు, మన ప్రియారిటీస్, నెలవారీ పేమెంట్స్ ఇలా అన్నిరకాల వివరాల నమోదు చేయాలి.
ఇలా ప్రిపేర్ చేయాలి
నెలవారీ ఆదాయంలోంచి ఫిక్స్డ్ ఖర్చులు, ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె వంటివన్నీ తీసేసాక మిగిలిన వాటిలో ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో రాయాలి. మీ ఖర్చుల కేటగిరీలను ఈ వరుసలో లిస్ట్ చేయాలి. ముందుగా అవసరాలు(ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె), ఆ తర్వాత కోరికలు (అలవాట్లు, ఎంటర్టైన్మెంట్), నెక్స్ట్.. కల్చర్ (పుస్తకాలు, సంగీతం, పండగలు) అలాగే చివరిగా అనుకోని ఖర్చులు.
ముందుగా కోరికలు, అవసరాల మధ్య తేడా తెలుసుకోవాలి. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా? దీన్ని నేను ఉపయోగిస్తానా? దీన్ని కొనడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? ఆ ఉపయోగం ఎంతకాలం ఉంటుంది? లాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఇలా మీకు మీరే ప్రశ్నలు వేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఖర్చులు, అవసరాలు, లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చుల్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా పొదుపు పెరుగుతుంది.
బెనిఫిట్ ఇదే..
ఇలా ఒక లిస్ట్ రూపంలో రాయడం వల్ల డబ్బు విషయాలపై శ్రద్ధ పెరుగతుంది. ఖర్చులు, ఆదాయాల గురించి స్పష్టమైన క్లారిటీ వస్తుంది. కొంతకాలం తర్వాత రాసుకోకపోయినా ఒక క్లారిటీ వస్తుంది. ఈ టెక్నిక్ తో ముప్పై నుంచి నలభై శాతం డబ్బు ఆదా చేయొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ టెక్నిక్ ను బేస్ చేసుకునే రకరకాల ఫైనాన్షియల్ ప్లానింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి.
































