మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 42 ఎక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించి, మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) రూ.5 కోట్లు CSR నిధుల ద్వారా మంజూరు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 950 కంప్యూటర్లు, UPSలు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయనున్నారు.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 42 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
గిరిజన వర్గానికి చెందిన పిల్లలకు ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య పాఠశాలలను స్థాపిస్తోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 479 ఏకలవ్య పాఠశాలలు పనిచేస్తున్నాయి.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువాల్ ఒరం నేతృత్వంలో, ప్రభుత్వ నిధులకు తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వినియోగించేందుకు అనేక కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు. ఇది జనజాతీయ గౌరవ వర్ష్ వేడుకల భాగంగా, గిరిజన యువతకు డిజిటల్ శక్తిని అందించి, సమగ్ర అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి దూరదృష్టి ప్రణాళికకు అనుగుణంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) రూ.5 కోట్లను CSR నిధుల ద్వారా అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను డిజిటల్ ఎడ్యుకేషన్, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఈ నిధులతో 950 కంప్యూటర్లు, 950 UPS పరికరాలు, 90 టాబ్లెట్లు, 430 శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు, 430 శానిటరీ ప్యాడ్ ఇన్సినిరేటర్లను… 42 ఎకలవ్య పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమయపాలనతో అమలు చేయనుంది.
ఈ కేటాయింపుల వెనుక ప్రధాన లక్ష్యాలు ఇప్పుడు తెలుసుకుందాం…
1. డిజిటల్ విద్యను ప్రోత్సహించడం: విద్యార్థులు, ఉపాధ్యాయులు 21వ శతాబ్దపు డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు. IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు డిజిటల్ ట్యూటరింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్‌లను మరింత బలోపేతం చేయడం. గిరిజన విద్యార్థులు టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ఉపయోగించుకునేలా చేయడం.
2. బాలికల ఆరోగ్యం, శుభ్రత: శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేసి మెన్స్ట్రుయల్ హెల్త్ అండ్ హైజీన్ను ప్రోత్సహించడం. బాలికల పాఠశాల విడిచిపెట్టే శాతం తగ్గించి, వారి విద్యా ప్రగతిని మెరుగుపరచడం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 26,000 మందికి పైగా గిరిజన విద్యార్థులు, అందులో 13,500 మంది బాలికలు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ సహకారం గిరిజన విద్యలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుంది. విద్య, ఆరోగ్యం, సాంకేతికత కలగలిసి గిరిజన యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరవనుంది.
































