తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇది. దీనిని యాదాద్రి అని కూడా అంటారు.
ఇది పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. అలాగే నరసింహ స్వామి తన భక్తుడైన యాదవ ఋషికి ఇక్కడ కనిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇది తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రదేశంగా అలరారుతోంది. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుంటారు.
స్థల చరిత్ర చూస్తే.. పూర్వం యాద మహర్షి అనే ఓ ముని ఇక్కడ తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతుంది. యాదర్షి కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండభేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదనే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహ పీడా నివారణతో పాటు ఇతర కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు.
ఈ ఆలయానికి చేరుకోవాలంటే యాదాద్రి లో రైల్వేస్టేషన్ ఉంది. యాదగిరిగుట్ట లో రెండు బస్ స్టేషన్ లు ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము నుండి యాదగిరిగుట్టకు ఉదయం 4.30 ని .లకు మొదటి బస్సు సౌకర్యం ఉంది. అయితే తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి యాదాద్రికి MMTS ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టును రైల్వే శాఖ ప్రారంభించింది. రూ.412 కోట్ల వ్యయంతో 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు తక్కువ ఖర్చుతో, గంటలోపే చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా ఎంఎంటీఎస్ స్టేషన్లను ఘట్ కేసర్, బీబీనగర్, పగిడిపల్లి, భువనగిరి, యాదాద్రి (రాయగిరి), వంగపల్లిల్లో ఏర్పాటు చేయనున్నారు.
అలాగే యాదగిరిగుట్టకు దగ్గర్లోనే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్ లో ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి ఆలయం విస్తరించి ఉంది. ఈ ఆలయ పరిసరాల్లోని సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహ స్వామి, వకుళమాతతోపాటుగా పుష్కరిణి, వేద మూర్తుల విగ్రహాలు, మధ్యలో జల నారాయణ స్వామి ఉన్నారు. అలాగే 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది.































