ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహాల్లో బంగారం కూడా ఒకటి. మరి అలాంటి బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కెజియఫ్ సినిమాలో మాదిరిగా రియల్ బంగారపు గనులు మనదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని తవ్వి తీసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మార్చి 31, 2025 నాటికి, భారతదేశం యొక్క మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు. అందులో చాలా భాగం కర్ణాటక నుంచే వస్తుంది. మనదేశంలో ముఖ్యంగా ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవేంటంటే..
హట్టి గోల్డ్ మైన్స్
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్.. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న బంగారు గని. దీన్ని కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన హట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో ఈ గని వాటా చాలా ఎక్కువ. ఏటా దాదాపు 1.8 టన్నుల బంగారం ఈ గని నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ గోల్డ్ మైన్ 2,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్
రెండోది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కెజియఫ్). ఇది ఒకప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద బంగారు గని. కానీ ఆర్థిక నష్టాల కారణంగా 2001 లో మైనింగ్ ను ఆపేశారు. ఇది ఒకప్పుడు ప్రపంచంలో రెండవ లోతైన బంగారు గని. 1880 ల్లో బ్రిటిష్ వాళ్లు ఈ గని నుండి సుమారు 800 టన్నుల బంగారం ఉత్పత్తి చేశారు.
































