ఎయిర్ కండీషనర్ల (ఏసీ)పై జీఎస్టీ రేటు ఈనెల 22 నుంచి 18 శాతానికి తగ్గనుంది. అంటే కొనుగోలుదార్లకు 10% ప్రయోజనం కలగనుంది. జీఎస్టీ ప్రయోజనానికి తోడు పండగ ఆఫర్లు వస్తాయనే భావనతో ఏసీలు కొనాలనేవారు వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తగ్గింపు ధరలతోనే ముందస్తు బుకింగ్ చేసుకోమని ఏసీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. జీఎస్టీ రూపేణ ఒక్కో ఏసీపై రూ.4,000 వరకు ధర తగ్గనుంది.
- తమ డీలర్లు తగ్గింపు ధరలతోనే ప్రీబుకింగ్ చేస్తున్నారని.. 22న బిల్ చేస్తారని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇప్పటికే తగ్గింపు ధరలతో ఎంఆర్పీ లేబుల్స్ సిద్ధం చేశామని..
భారీగా ఆర్డర్లు ఉంటాయనే భావనతో ఏసీల బిగింపు కోసం అదనపు సిబ్బందినీ సిద్ధం చేస్తున్నామని వివరించారు.
- రూపాయి చెల్లించి ఏసీని బుక్ చేసుకోవాలని.. ఎంపిక చేసిన చెల్లింపు పథకాల్లో 10% వరకు నగదు వెనక్కి ఇస్తామని హైయర్ ప్రకటించింది. ఏసీల ధరలు రూ.2,577-3,905 మేర తగ్గుతాయని తెలిపింది.
- గోద్రేజ్ డీలర్లు కూడా కొంతమంది ప్రీబుకింగ్ చేస్తున్నట్లు కంపెనీ అప్లయన్సెస్ వ్యాపార అధిపతి కమల్ నంది తెలిపారు.
































