నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడికాపూల్, నాంపల్లి, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో సైతం భారీ వర్షం పడుతోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, హిమాయత్ నగర్లలో మోస్తారు వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతోంది. ఐటీ కారిడార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరో రెండు గంటల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని GHMC అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశముండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్‌పేట్, మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రాంతాల్లో పర్యటించిన హైడ్రా కమిషనర్.. పైనుండి వస్తున్న భారీ వరదతో మైత్రివనం వెనుక ఉన్న గాయత్రీ నగర్‌కి వరద ముప్పు ఉన్నట్లు గుర్తించారు. మైత్రివనం వద్ద చేసినట్లుగానే గాయత్రి నగర్‌లో కూడా నాలాలో సీల్డ్ తొలగించాలని స్థానికులు హైడ్రా కమీషనర్ రంగనాథ్ కోరారు. నాళాల్లో పూడిక తీసి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానికులకు హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు.
దుర్గం చెరువులో నీటిమట్టం తగ్గించడంతో కొంతమేర పరిసర కాలనీలకు ముంపు సమస్య తీరనున్నట్లు హైడ్రా కమిషనర్ గుర్తించారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల పైగా వర్షం పడడంతో ఇబ్బందులు తలెత్తాయని హైడ్రా కమీషనర్ స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులను తట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాగ్ లింగంపల్లిలో నీట మునిగిన శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన హైడ్రా కమిషనర్.. కాలనీ నుంచి వరద నీటిని త్వరగా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ సూచించారు.
































