మనిషికి నీరు ఎంతో అవసరం. నీరు లేకపోతే మనం ఉండలేం. వైద్యులు కూడా పుష్కలంగా నీరు తాగాలని చెబుతారు. రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని చెబుతారు.
అయితే ఈ మొత్తం అందరికీ సరిపోతుందా..? లేదా అంతకంటే ఎక్కువ అవసరమా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు నిపుణుల ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2.5 లీటర్ల నీరు సరిపోతుందా..?
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రోహిత్ శర్మ ప్రకారం.. రోజుకు 2.5 లీటర్ల నీరు తాగడం సాధారణంగా సరిపోతుంది. అయితే ఇది వ్యక్తి శరీర బరువు, వయస్సు, వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు, వారి దైనందిన కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఉదాహరణకు.. ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగడం అవసరం. అలాగే వ్యాయామం చేసేవారు లేదా శారీరకంగా ఎక్కువగా శ్రమించే వారికి కూడా ఎక్కువ నీరు అవసరం. నీటితో పాటు, పండ్లు, కూరగాయలు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి.
డీటాక్స్ డ్రింక్స్ అవసరమా?
మన శరీరం సహజంగానే విషపదార్థాలను బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ముఖ్యంగా కాలేయం, జీర్ణ వ్యవస్థ నిర్వహిస్తాయి. కాబట్టి డీటాక్స్ పానీయాలు తప్పనిసరి కాదని వారు అంటున్నారు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, సరైన మోతాదులో నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. డీటాక్స్ పానీయాల వల్ల బరువు తగ్గడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, శాస్త్రీయంగా అవి ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. ఏదైనా డీటాక్స్ పానీయం తీసుకోవాలంటే ముందుగా నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
ఎక్కువగా లేదా తక్కువగా తాగడం హానికరం..!
రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ఒక సాధారణ వ్యక్తికి అనువైనది. కానీ చాలా తక్కువ నీరు తాగితే అలసట, తలనొప్పి, పొడి చర్మం వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా శరీర అవసరాలకు మించి ఎక్కువ నీరు తాగడం కూడా ప్రమాదకరం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను దెబ్బతీసి, వాంతులు, బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. అంతేకాకుండా మీకు మూత్రపిండాల సమస్యలు వంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఎంత నీరు తాగాలి అనే విషయంపై వైద్యుడిని సంప్రదించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




































