బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసా..? పట్టించుకోకపోతే అంతే సంగతులు..

బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు రక్తం సరఫరా ఆగిపోవడం. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులోని కణాలు దెబ్బతింటాయి. వెంటనే చికిత్స చేయకపోతే పక్షవాతం, మాటలు పడిపోవడం లేదా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.


డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం, చాలామంది స్ట్రోక్ ప్రారంభ లక్షణాలను పట్టించుకోరు. కానీ ఈ చిన్న సంకేతాలే ప్రాణాన్ని కాపాడవచ్చు.

ప్రారంభ లక్షణాలు ఇవే:

ముఖం వంకరగా మారడం: స్ట్రోక్ వస్తే సాధారణంగా ముఖం ఒక వైపు వంకరగా అవుతుంది. నవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఒక వైపు చిరునవ్వు వంకరగా కనిపిస్తుంది.

చేతులు, కాళ్ళలో తిమ్మిరి: శరీరం ఒక వైపున, ముఖ్యంగా చేతులు లేదా కాళ్ళలో అకస్మాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత వస్తుంది.

కళ్ళు మసకబారడం: ఒక్కసారిగా దృష్టి మసకబారడం, ఒక కంటితో సరిగా కనిపించకపోవడం లేదా రెండు ప్రతిబింబాలు కనిపించడం కూడా స్ట్రోక్ లక్షణాలు కావచ్చు.

తల తిరగడం: ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా తల తిరగడం, నిలబడలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటివి కూడా స్ట్రోక్ కు సంకేతాలు.

లక్షణాలను సులభంగా గుర్తించడం ఎలా?

ఈ లక్షణాలను గుర్తించడానికి F.A.S.T (ఫాస్ట్) అనే ఒక సులభమైన పద్ధతి ఉంది.

F (Face – ముఖం): నవ్వినప్పుడు ముఖం వంకరగా ఉందా అని చూడండి.

A (Arm – చేయి): రెండు చేతులను పైకి లేపమని చెప్పండి. ఒక చేయి కిందికి పడిపోతే జాగ్రత్త పడాలి.

S (Speech – మాట): మాట్లాడినప్పుడు మాట నత్తిగా ఉందా లేదా సరిగా అర్థం అవ్వడం లేదా అనేది గమనించండి.

T (Time – సమయం): ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే సమయం వృథా చేయకుండా ఆసుపత్రికి వెళ్ళండి.

స్ట్రోక్‌ను నివారించడం ఎలా?

రక్తపోటు – షుగర్ నియంత్రణ: ఇవి స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు. వీటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

మంచి అలవాట్లు: ధూమపానం, మద్యం మానేయడం మంచిది. మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.

సమయానికి నిద్ర: సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

వైద్య పరీక్షలు: ఎప్పటికప్పుడు గుండె మరియు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

గుర్తుంచుకోండి.. స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం చాలా ముఖ్యం. ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే, ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.