నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుస శుభవార్తలు అందిస్తుంది. ఇటీవలే ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే పనిలో నిమగ్నమైంది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పోలీస్ శాఖలోని వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం ఏకంగా 12,452 పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పోలీస్ శాఖ ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.
ఈ నివేదిక ప్రకారం.. అత్యధికంగా 8,442 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,271 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే దాదాపు 11వేలకు ఖాళీలను భర్తీ చేసందుకు సిద్ధమైంది. పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అలాగే కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయనుంది. సివిల్ ఎస్సై కేటగిరీలో 677, ఏఆర్ ఎస్సై కేటగిరీలో 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. దీంతో వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా తాము అధికారంలో వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించనుంది. ఇక త్వరలోనే పోలీస్ శాఖలోనూ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
































