ఆర్టీసీ స్పెషల్ బాదుడు – ఈ రూట్ల బస్సుల్లో కొత్త ఛార్జీలు.

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. దసరా, బతుకమ్మ వేళ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది.


7,754 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. కాగా, రెగ్యులర్ కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లెవెలుగు సహా అన్ని బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉండటంతో ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అంచనాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది.

అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించనుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే, స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లోనూ ఈ అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు.

రెగ్యులర్ సర్వీసుల్లో ధరల పెంపుదల ఉండదని అధికారులు స్పష్టం చేసారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్లో చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్ లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.