ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇందులో కేంద్రం నుంచి రూ.17,500.. రాష్ట్రం తరపున రూ.32,500 ఇవ్వనున్నారు. మొత్తంగా రైతుల భారం తగ్గించే దిశగా ఈ చర్యను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కాగా కొన్నాళ్లుగా మార్కెట్లో ఉల్లి ధరలు బార్లాగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కిలోకు వచ్చిన ధర కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులకూ సరిపోని స్థితి ఏర్పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో రైతులు ఉల్లిని రోడ్డుపై పారబోసే పరిస్థితులు వచ్చాయి. పంట పండించినా నష్టమే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందన..
రైతుల సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. హెక్టారుకు రూ.50 వేలు అందించడం వల్ల కనీసం రైతులు పెట్టుబడులు తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఉల్లి పండించే రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా.. ఉల్లికి కనీస మద్దతు ధర (MSP) ఖరారు చేయడం.. మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొల్డ్ స్టోరేజ్ సదుపాయాలను పెంచడం వంటి చర్యలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాలని సంకేతాలు ఇస్తున్నారు.
































