ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం అయినది వృద్ధాప్యం. అటువంటి వృద్ధాప్యం బారిన పడిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వారికి భరోసా ఇచ్చేలా ఇప్పటికే ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహాయంతో రాష్ట్రంలోని వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను అందజేస్తోంది. ఈ కార్డులతో సీనియర్ సిటిజన్లు అనేక రాయితీలను పొందే అవకాశం ఉంటుంది.
ఈ కార్డుతో సంక్షేమ పథకాలు, రాయితీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డుల పైన అవగాహన లేకపోవడం వల్ల వాటిని తీసుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని సాంకేతిక, సర్వర్ సమస్యలు కూడా రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలలో రాయితీలు పొందవచ్చు.
బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీరికి ప్రత్యేకమైన కౌంటర్లు
రైల్వే టికెట్ల పైన రాయితీలు, ఇతర ప్రభుత్వ సేవలలో రాయితీలు పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. రైళ్లలో లోయర్ బెర్త్ కేటాయింపుకు ఈ కార్డ్ సపోర్ట్ అవుతుంది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీరికి ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసి, ఎక్కువసేపు వెయిట్ చేయకుండా చూస్తారు. ఇక కోర్టు కేసులలో కూడా వీరికి విచారణలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీరి కేసుల పరిష్కారం వేగవంతంగా చేయబడుతుంది.
దరఖాస్తు చేసుకుంటే పది నిముషాల్లోనే కార్డు
ఈ కార్డు ఒక ప్రామాణికమైన గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. పురుషుల 60 సంవత్సరాలు మహిళలు 58 సంవత్సరాలు నిండిన వారు ఈ సీనియర్ సిటిజన్ కార్డులు పొందడానికి అర్హులు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు వెంటనే దరఖాస్తు చేసుకుంటే కేవలం పది నిమిషాల్లోనే సీనియర్ సిటిజన్ కార్డు అందుతుంది.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే
దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు ధ్రువీకరణ పత్రం, బ్లడ్ గ్రూపు, అడ్రస్ ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు సచివాలయంలో అప్లికేషన్ తో పాటు ఇస్తే సరిపోతుంది. అప్లై చేసిన వెంటనే పది నిమిషాల్లోనే మీకు సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు చేయబడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే సీనియర్ సిటిజన్ కార్డును వృద్ధులైన వారందరికీ తీసుకొని ప్రభుత్వం నుంచి వారికి అందే సేవలను పొందేలా చూడాలని ప్రభుత్వం కోరుతోంది.
































