పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ లబ్దిదారులకు బిగ్ అప్డేట్స్. ఈ రెండు పథకాల నిధులను మరోసారి ఒకే సారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం సైతం ఖరారైంది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను పీఎం కిసాన్ తో కలిపి ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హత ఉండీ జమ కాని రైతులకు మరో సారి అవకాశం కల్పించింది. కాగా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత – పీఎం కిసాన్ కలిపి రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతీ ఏటా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ తో కలిపి రూ 20 వేలు ఇస్తామని ఎన్నిక ల వేళ హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది.
దీంతో, పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిని నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేసారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్-జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేసారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6వేలు ఇస్తుండగా, అన్నదాత-సుఖీభవ కింద రూ.14వేలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతోపాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం.. అక్టోబర్ 18న కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు జమ చేస్తాయని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత-సుఖీభవ కింద రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబరులో రూ.10వేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు అన్నదాత-సుఖీభవ పథకం కింద సుమారు 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్‌ల్యాండ్ నుంచి తీసుకుని, అన్నదాత-సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధ్రువీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాపులో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 2025-26లో ఇంతవరకు 5.9లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల ద్వారా తమ అర్హతను పరిశీలించుకునే అవకాశం కల్పించారు. దీపావళికి ముందే ఈ పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.






























