పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. ఏమిటో తెలుసా?

 హిందూ క్యాలెండర్‌లో అతి పెద్ద పండుగలు దసరా, దీపావళి వస్తున్నాయి. ఈ పండుగల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఆయా ప్రభుత్వాలు తీపి కబురు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.


బోనస్‌, కరువు భత్యం, జీతాల పెంపు, వేతన సంఘం వంటి బహుమతులు లభిస్తుంటాయి. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూడా భారీగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈసారి డబుల్‌ జాక్‌పాట్‌ ఉంటుందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డబుల్ జాక్‌పాట్ తగలనుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి కరువు భత్యం పెంపు; రెండో 8వ వేతన సంఘం ఏర్పాటు. ఈ రెండూ కూడా దసరా, దీపావళి ముందు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. యథావిధిగా ఏడాదికి విడుదల చేయాల్సిన రెండు డీఏల్లో రెండో కరువు భత్యం రావాల్సి ఉంది. ఇక కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కూడా త్వరలో ఏర్పాటు కావాల్సి ఉంది.

ఈ దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 3 శాతం పెంపును ప్రకటించనుంది. రెండో జాక్‌పాట్ ఏమిటంటే అదనంగా ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురానుంది. ఇది 2026 నుంచి జీతాలు, పెన్షన్‌లలో భారీ మార్పులు జరగనున్నాయి.

డీఏ పెంపు
డీఏ లేదా కరువు భత్యం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే అదనపు ఆర్థిక ప్రయోజనం. ద్రవ్యోల్బణాన్ని కొలమానం చేసే వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్‌లలో రెండుసార్లు సవరిస్తారు. ప్రస్తుతం డీఏ ప్రాథమిక వేతనంలో 55 శాతం ఉంది. దీపావళికి ముందు 3 శాతం పెంపుదల. దానిని 58 శాతానికి పెంచనుంది. దీని వలన 1.2 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రయోజనం లభించనుంది.

8వ వేతన సంఘం
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు భారీగా పెరగడంలో వేతన సవరణ సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాదితో ముగియనుంది. 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రకారం 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం వేతనాలు, పింఛన్‌లలో భారీగా పెరుగుదల రానుంఇ. సవరించిన వేతనాన్ని లెక్కించడానికి ఉపయోగించే ఫిట్‌మెంట్ కారకం 2.57 నుంచి 2.86కి పెరగవచ్చు. కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.51,480కి పెరుగనుంది. ఇక కనీస పెన్షన్లు రూ.9 వేల నుండి రూ.25,740కి పెరగనున్నాయి. జీతాలు, పెన్షన్లు 30 నుంచి 34 శాతం పెరగవచ్చు. 8వ వేతన సంఘం ద్వారా 50 లక్షలకు పైగా ఉద్యోగుల వేతనాల్లో భారీ పెరుగుదల, 65 లక్షల మంది పింఛన్‌దారుల్లో ప్రత్యక్షంగా భారీ ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు డబుల్‌ జాక్‌పాట్‌ పొందనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.