మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీర్తి కిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేసింది. సినీ కళామ తల్లికి ఆయన అందించిన సేవలకు ప్రతీకగా కేంద్ర ప్రభుత్వం మోహన్ లాల్ న అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తో సత్కరించనుంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. సినిమా రంగానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ నటుడిని అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే తో సత్కరించనుంది. శనివారం (సెప్టెంబర్ 20) కేంద్ర సమాచార, ప్రసారాశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ లాల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్ స్టార్ కు ప్రత్యేకంఆ శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న మోడీ.. ‘మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. ఆయన ఎన్నో దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు . ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు ప్రధాని మోడీ.
సోదరుడికి శుభాకాంక్షలు..
ఇదే సందర్భంగా మరో మలయాళ స్టార్ మమ్ముటి మోహన్‌లాల్‌కు అభినందనలు తెలిపారు. తనకు మోహన్‌లాల్ సోదరుడివంటివారని, ఆయన అద్భుత సినీ ప్రయాణినికి ఈ అవార్డు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు.




































