కరువు భత్యమూ కరువే.. ఉద్యోగులకు సర్కారు బాకీ 900 కోట్లు

ఒకపక్క సీపీఎస్‌తో భద్రత కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఏ బకాయిలను కాంగ్రెస్‌ సర్కార్‌ విడుదల చేయకపోవడంతో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.


డీఏలను ఆలస్యంగా విడుదల చేసినా, డీఏ బకాయిలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏను చెల్లించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు డీఏలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ డీఏలు పాతవి కావడంలో ఎప్పటి నుంచి బకాయి పడ్డారో అప్పటి నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. వీటినే డీఏ బకాయిలని పేర్కొంటారు. ఇలా విడుదల చేసిన ఈ రెండు డీఏల్లో 90 శాతం అలవెన్స్‌ను విడతల వారీగా చెల్లిస్తామని డీఏల విడుదల సమయంలోనే సర్కారు స్పష్టంచేసింది. మొదటి డీఏకు సంబంధించి ఆరు నెలల డీఏ ఎరియర్స్‌ బకాయి పడ్డది. ఈ మొత్తం విలువ రూ.600 కోట్లు కాగా, రెండో డీఏ ఎరియర్స్‌ మూడు నెలలు బకాయి పెట్టింది. వీటి విలువు రూ.300 కోట్లు. ఒక నెల బకాయి కింద రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఈ కాలంలో సీపీఎస్‌ ఉద్యోగులు రూ.900 కోట్ల మేరకు నష్టపోయారు. 2022 జూలై నుంచి 2024 అక్టోబర్‌ వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నది. 2023 జనవరి నుంచి 2025 జూన్‌ వరకు ఇవ్వాల్సిన మరో డీఏ బకాయిలను 2025 జూలై నుంచి 28 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నది.

‘దసరాలోపు ఎరియర్స్‌ చెల్లించండి’

దసరా పండుగలోపు ఉద్యోగులకు డీఏ ఎరియర్స్‌ను చెల్లించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌ సీపీఎస్‌ఈయూ) డిమాండ్‌ చేసింది. ఇటీవలే సీఎస్‌ రామకృష్ణారావును కలిసి సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కల్వల్‌ శ్రీకాంత్‌, నరేశ్‌గౌడ్‌, కోటకొండ పవన్‌, నరేందర్‌రావు వినతిపత్రాన్ని సమర్పించరారు. ఆరు నెలలకు ఇవ్వాల్సిన డీఏను రెండేండ్ల తర్వాత ఇచ్చి వీటికి సంబంధించిన బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని, వాటిని కూడా సకాంలో చెల్లించడం లేదని వారు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ పరిస్థితి

  • మొదటి డీఏకు 17 వాయిదాల డీఏ బకాయిలను 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మూడు వాయిదాలనే చెల్లించారు.
  • 2025 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నెలనెలా చెల్లించాల్సిన ఆరు వాయిదాలను ఇంకా చెల్లించలేదు.
  • రెండో డీఏ 2025 జూలై నుంచి 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. జూలై పోయింది. ఆగస్టు గడిచిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్‌ ఆఖరుకు చేరింది. ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించనేలేదు.
  • మొదటి డీఏవి ఆరు విడతలు, రెండో డీఏవి మూడు విడతల చొప్పున మొత్తం 9 విడతల ఎరియర్స్‌ను సర్కారు బాకీపడింది.

సీపీఎస్‌ ఉద్యోగులకు శాపం

పాత పింఛన్‌ పథకంలోని (ఓపీఎస్‌) ఉద్యోగులకు డీఏ బకాయిలు ఒకేసారి జీపీఎఫ్‌ అకౌంట్లో జమచేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు ఆయా వాయిదాలనూ చెల్లించడంలేదు. ఫలితంగా అసలు, వడ్డీ రెండింటినీ కోల్పోతున్నారు. జీపీఎఫ్‌లో ఖాతా నుంచి నగదు డ్రా చేసుకోవచ్చు. కానీ సీపీఎస్‌ ఉద్యోగులకు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగ విరమణ పొందాక ఉద్యోగి వెంటనే పెన్షన్‌ పొందే పరిస్థితి లేదు. 18 వాయిదాల్లో చెల్లించిన డీఏ నుంచి రికవరీ చేసిన 10 శాతం ఉద్యోగి ప్రాన్‌ ఖాతాలో జమయ్యేంత వరకు పెన్షన్‌ ప్లాన్‌ కొనుక్కునే అవకాశమే లేదు. ఒకవేళ పెన్షన్‌ ప్లాన్‌ కొనుక్కున్నా ప్రాన్‌ ఖాతా రద్దవుతుంది. దీంతో ఉద్యోగికి చెందాల్సిన డబ్బు ప్రభుత్వ ఖాతాలోనే ఉంటున్నాయి. దీంతో సీపీఎస్‌ ఉద్యోగులు నెలకు వెయ్యి, 2 వేల పెన్షన్‌ను పొందే వీలు ఉంటున్నది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.