క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రాంతం లగ్జరీ రిసార్ట్‌గా మారుతోంది..

జిప్ట్‌లోని సినాయి పర్వతం పైనుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు ఎన్నో ఏళ్లుగా పర్యటకులు ఈ పర్వతంపైకి వెళ్తుంటారు. పర్యటకులు ఈ పర్వతాన్ని ఎక్కేందుకు బెడోయిన్ గిరిజన తెగకు చెందిన గైడ్‌లు సహకరిస్తుంటారు.


ఈజిప్ట్‌లోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో సినాయి పర్వతం ఉన్న ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతం యూదులు, క్రైస్తవులు, ముస్లింల విశ్వాసాలతో ముడిపడివుంది.

అయితే, ఇదే ప్రాంతంలో సరికొత్తగా పర్యటక రంగ అభివృద్ధి కోసం ఒక మెగా ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నద్ధం కావడం వివాదాస్పదమైంది.

సినాయి పర్వతాన్ని (మౌంట్ సినాయ్) స్థానిక ప్రజలు జబల్ మూసా అని కూడా పిలుచుకుంటారు. ఈ పర్వతం మీదే మోజెస్‌కు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడని విశ్వసిస్తారు.

బైబిల్, ఖురాన్ ప్రకారం మండుతున్న పొద నుంచి దేవుడు ప్రవక్తతో మాట్లాడింది ఈ ప్రదేశం నుంచేనని చాలామంది నమ్మకం.

గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి నడిపే 6వ శతాబ్దపు సెయింట్ కేథరీన్ ఆశ్రమం ఇక్కడే ఉంది. గ్రీస్ నుంచి ఒత్తిడితో ఈ ఆశ్రమాన్ని మూసివేయించే ఉద్దేశం లేదని ఈజిప్ట్ అధికారులు తెలిపారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొంది, ఎంతోకాలంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ ఎడారి ప్రాంతం ఇప్పుడు లగ్జరీ హోటళ్లు, విల్లాలు, షాపింగ్ మాల్స్‌గా మారుతుండటంపై ఆందోళన నెలకొంది.

స్థానికులు ఈ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారా?

ఇక్కడ ప్రధానంగా నివసించేది సంప్రదాయ బెడోయిన్ గిరిజన తెగకు చెందిన జెబెలియా తెగ.

సెయింట్ కేథరీన్‌కు సంరక్షకులుగా పరిగణించే ఈ తెగకు అక్కడ ఇళ్లు ఉన్నాయి. పర్యటకుల కోసం ఎకో క్యాంపులు ఏర్పాటు చేశారు.

వీటన్నింటినీ ఇప్పుడు ఎలాంటి పరిహారం లేకుండానే లేదా తక్కువ పరిహారం చెల్లించి కూల్చివేశారు.

కారు పార్కింగ్ ఏరియా కోసం అక్కడి స్థానిక శ్మశాన వాటిక నుంచి మృతదేహాలను కూడా తొలగించాల్సి వచ్చింది.

”పర్యటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన, సుస్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టుగా దీన్ని చూపించొచ్చు. కానీ, బెడోయిన్ కమ్యూనిటీ ఇష్టానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకొస్తున్నారు” అని సినాయి తెగలతో పనిచేసే బ్రిటిష్ ట్రావెల్ రైటర్ బెన్ హోఫ్లర్ అన్నారు.

” జెబెలియా ప్రజలు కోరుకుంటోంది ఈ తరహా అభివృద్ధి కాదు” అని బీబీసీతో చెప్పారు.

ఈ అభివృద్ధి స్థానికుల కోసం కాకుండా బయటి వారి ప్రయోజనాల కోసం చేస్తున్నారని అన్నారు.

” సంచారజీవులైన బెడోయిన్ తెగకు చుట్టూ ఈ సరికొత్త పట్టణ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు” అని బెన్ హోఫ్లర్ అన్నారు.

” వారు ఎప్పటికీ దూరంగా ఉండాలనుకునే ప్రపంచం ఇది. ఇలాంటి ప్రపంచాన్ని నిర్మించేందుకు వారెప్పటికీ అనుమతించరు. ఈ కొత్త ప్రపంచం వారి మాతృభూమిని పూర్తిగా, శాశ్వతంగా మార్చేస్తుంది” అన్నారు.

అయితే, ఈ మార్పులపై బహిరంగంగా మాట్లాడేందుకు అక్కడున్న సుమారు 4 వేల మంది స్థానికులు మొగ్గు చూపలేదు.

గ్రీస్, ఈజిప్ట్ మధ్య ఘర్షణకు కారణమేంటి?

ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రైస్తవ ఆశ్రమం సెయింట్ కేథరీన్ ప్రభుత్వ భూమిలో ఉందని మే నెలలో ఈజిప్టియన్ కోర్టు వెలువరించిన తీర్పుతో గ్రీస్, ఈజిప్ట్ మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.

దశాబ్దాల వివాదం అనంతరం.. ఈ ఆశ్రమం ఉన్న ప్రాంతం, దాని చుట్టుపక్కల పురావస్తు మతపరమైన ప్రదేశాలను మాత్రమే ఈ ఆశ్రమం వినియోగించుకోవచ్చంటూ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు.

అయితే, గ్రీస్ చర్చి హెడ్, ఏథెన్స్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఇరోనిమోస్ 2 ఈ తీర్పును ఖండించారు.

ఆశ్రమ ఆస్తులను ఆక్రమిస్తున్నారని, స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు.

“ఆర్థోడాక్సీ, హెల్లెనిజానికి చెందిన ఈ ఆధ్యాత్మిక చిహ్నం ఇప్పుడు అస్థిత్వ సమస్యలను ఎదుర్కొంటోంది” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

” కోర్టు నిర్ణయం మాకు భారీ ఎదురుదెబ్బ. అవమానం” అని సెయింట్ కేథరీన్‌కు సుదీర్ఘకాలంగా ఆర్చ్‌బిషప్‌గా ఉన్న డామియానోస్ ఒక గ్రీస్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ కేసు విషయంలో ఆయన వ్యవహరించిన పద్ధతి క్రైస్తవ సన్యాసుల్లో తీవ్రమైన విభజనలకు, విభేదాలకు దారితీసింది.

దీంతో, ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని ఇటీవలే నిర్ణయించుకున్నారు.

ఈ పవిత్ర స్థలంపై తమకు మతపరమైన అధికార పరిధి ఉందని, ఈ స్థలానికి ముహమ్మద్ ప్రవక్తనే రక్షణ పత్రం ఇచ్చారని గ్రీక్ ఆర్థోడాక్స్ పాట్రియార్కేట్ ఆఫ్ జెరూసలెం పేర్కొంది.

బైజాంటైన్ యుగంలోని ఈ ఆశ్రమంలో, ఫాతిమిద్ కాలంలో ఒక చిన్న మసీదును కూడా నిర్మించారని తెలిపింది.

ఇది క్రైస్తవులు, ముస్లింల మధ్య శాంతికి చిహ్నమని, సంఘర్షణలతో సతమతమైన ప్రపంచంలో ఇదొక ఆశాజనక ప్రదేశమని పేర్కొంది.

వివాదాస్పదమైన కోర్టు నిర్ణయం అమల్లో ఉన్నప్పటికీ.. సెయింట్ కేథరీన్ గ్రీక్ ఆర్థోడాక్స్ గుర్తింపును, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలని దౌత్య ప్రయత్నాల ద్వారా గ్రీస్, ఈజిప్ట్‌లు జాయింట్ డిక్లరేషన్‌ చేసుకున్నాయి.

‘ప్రత్యేక బహుమతా’ లేక సున్నితమైన జోక్యమా?

పర్యటకుల కోసం సినాయి ప్రాంతాన్ని మార్చేందుకు 2021లో ఈజిప్ట్ ఒక మెగా ప్రాజెక్టును చేపట్టింది.

ఈ ప్రాజెక్టు ప్రణాళికలో హోటళ్లు, ఎకో లాడ్జీల ఏర్పాటు, అతిపెద్ద సందర్శకుల కేంద్రాన్ని నెలకొల్పడం, దగ్గర్లోని చిన్న విమానాశ్రయాన్ని విస్తరించడం, మౌంట్ మాసెస్‌కు కేబుల్ కారును నిర్మించడం వంటివి ఉన్నాయి.

మొత్తం ప్రపంచానికి, అన్ని మతాలకు ఈజిప్ట్ ఇస్తోన్న బహుమతి అని ఆ ప్రభుత్వం చెప్పుకోవడం ప్రారంభించింది.

” ఈ ప్రాజెక్టు పర్యటకులకు టూరిజాన్ని, వినోద సేవలను అందిస్తుంది. సెయింట్ కేథరీన్ నగరాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అలాగే, వాటి వారసత్వాన్ని కాపాడుతుంది. సెయింట్ కేథరీన్‌లో ప్రాజెక్టుల కోసం పనిచేసే వారికి ఇళ్లను అందిస్తుంది” అని ఈజిప్ట్ హౌసింగ్ మినిస్టర్ షరీఫ్ అల్-షెర్బిని గత ఏడాది చెప్పారు.

నిధుల సమస్యతో ప్రస్తుతం తాత్కాలికంగా ఈ పనులు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఎల్-రహా ప్రాంతాలను ఇప్పటికే పూర్తిగా మార్చేశారు. కొత్త రహదారులను నిర్మిస్తున్నారు.

ఈ ప్రాంతపు సహజ సౌందర్యాలను ధ్వంసం చేస్తున్నట్లు విమర్శకులు అంటున్నారు.

యునెస్కో ఈ ప్రాంతపు ప్రాధాన్యాన్ని వివరించినప్పుడు, ”చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతం, ఆశ్రమానికి ఎలా అనువైనదిగా నిలిచిందో” వర్ణించింది.

ఒకవైపు సహజ సౌందర్యం, ఏకాంతం.. మరోవైపు ఆధ్యాత్మికత మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచే ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తుందని యునెస్కో తెలిపింది.

యునెస్కో లేవనెత్తిన అంశాలేంటి?

2023లో యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులను నిలిపివేయాలని ఈజిప్ట్‌ను కోరింది.

అంతేకాక, ఈ ప్రాంతపు ప్రకృతిపై ఇవి చూపే ప్రభావాన్ని పరిశీలించి, వాటి పరిరక్షణకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించింది.

అయితే, యునెస్కో సూచనలు మాత్రం ఇప్పటి వరకు అమలు కాలేదు.

ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సెయింట్ కేథరీన్ ప్రాంతాన్ని కూడా చేర్చాలని వరల్డ్ హెరిటేజ్ వాచ్ జులై నెలలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి బహిరంగ లేఖ రాసింది.

ఈ ప్రాంతాన్ని రక్షించాలంటూ పోరాటం చేస్తోన్న క్యాంపెయినర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్‌ను ఆశ్రయించారు.

సెయింట్ కేథరీన్ ఫౌండేషన్‌ ధర్మకర్తగా ప్రస్తుతం ఆయన ఉన్నారు.

ఈ ఫౌండేషన్ ఈ ఆశ్రమ వారసత్వాన్ని కాపాడుతూ, దానిలో ఉన్న విలువైన పురాతన క్రైస్తవ రాతప్రతులను అధ్యయనం చేయడానికి నిధులను సేకరిస్తుంది.

ఈ ప్రాంతం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక సంపదని, దీన్ని తప్పనిసరిగా సంరక్షించాల్సి ఉందని కింగ్ చార్లెస్ అన్నారు.

అయితే, తన దేశ ప్రత్యేక చరిత్రకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యహరించి విమర్శలు ఎదుర్కొంటోన్న ఈజిప్ట్ ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు.

ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తమ ఆర్థిక వ్యవస్థ కోసం ఈజిప్ట్ ప్రభుత్వం ఇలాంటి పలు స్కీమ్‌లను తీసుకొచ్చింది.

2028 నాటికి 3 కోట్ల మంది పర్యటకులను ఆకర్షించాలని ఈజిప్ట్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, గతంలో కూడా ఈజిప్ట్‌ను పాలించిన పలు ప్రభుత్వాలు.. కనీసం స్థానిక బెడోయిన్ కమ్యూనిటీలను సంప్రదించకుండానే సినాయి ప్రాంతంలో వాణిజ్యపరమైన అభివృద్ధి పనులు చేపట్టాయి.

Ben Hofflerఎల్-రహాలో నిర్మాణంలో ఉన్న హోటల్

1967లోని మధ్యప్రాచ్య యుద్ధంలో ఈ ద్వీపకల్పాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1979లో ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ద్వీపకల్పం ఈజిప్ట్ ఆధీనంలోకి వచ్చింది.

అప్పటి నుంచి తమను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నట్లు బెడోయిన్ కమ్యూనిటీ ఫిర్యాదు చేస్తూనే ఉంది.

1980లలో దక్షిణ సినాయిలోని షర్మ్ ఎల్-షేక్‌తో సహా పలు ప్రముఖ ఎర్ర సముద్రపు పర్యటక ప్రదేశాల్లో నిర్మాణాలు మొదలయ్యాయి. అదే విధంగా, ప్రస్తుతం సెయింట్ కేథరీన్‌లో కూడా జరుగుతున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

” బెడోయిన్లు ఈ ప్రాంతపు ప్రజలు. వారు గైడ్‌లు, వర్కర్లు. ఇక్కడ వ్యాపారాలు చేసుకునేది వీరే. పారిశ్రామిక పర్యటకం వచ్చిన తర్వాత, వారిని గెంటేశారు” అని ఈజిప్ట్ జర్నలిస్ట్ మోహనద్ సబ్రి చెప్పారు.

ఎర్ర సముద్రపు ప్రదేశాలలానే, సెయింట్ కేథరీన్‌లో సరికొత్త అభివృద్ధి దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తుంది. బెడోయిన్ నివాస ప్రాంతాలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

గత 1500 ఏళ్లలో సెయింట్ కేథరీన్ ఆశ్రమం పలు ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను ఎదుర్కొంది.

ఇటీవల కాలంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు రావడం కనిపిస్తోంది. క్రైస్తవ లేఖనాల్లో అతి ముఖ్యమైన రాత పత్రుల్లో ఒకటైన కోడెక్స్ సినైటికస్‌ పేజీలున్న మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు.

ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన, బైబిల్‌ సరికొత్త నిబంధనకు చెందిన చేతితో రాసిన కాపీ. దీన్ని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ సంరక్షించారు.

ఇప్పుడు ఆ మఠం, ఆ ప్రదేశానికి మతపరమైన ప్రాముఖ్యత అలాగే ఉన్నప్పటికీ, దాని పరిసరాలు, శతాబ్దాల జీవన విధానాలు తిరిగి మార్చలేని విధంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

సినాయి పర్వతం, ఈజిప్ట్, గ్రీస్, ఇజ్రాయెల్, క్రైస్తవులు, ముస్లింలు, యూదులు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.