సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో శరన్నవరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీకగా దసరాను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి రోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, నైవేద్యాలు జరగనున్నాయి.
ఈ పండుగలో వ్రతదీక్షలు చాలా కీలకమని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల్లో చాలామంది మాలను వేసుకుని, కఠిన నియమాలను పాటిస్తారు. ఈ సమయంలో మద్యపానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. అలాగే ఇతరుల ఇళ్లలో భోజనం చేయడం, బయట ఆహారం తినడం తప్పనిసరిగా నివారించాలి. ఘటస్థాపన చేసేవారు చెప్పులు ధరించకుండా, గ్రామం లేదా ఇల్లు విడిచి బయటకు వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా చెడు ఆలోచనలు, గొడవలు, కోపం, కామం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండి ఎల్లప్పుడూ అమ్మవారిని ధ్యానించడం చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు.
అమ్మవారి కృపను పొందేందుకు భక్తులు తొమ్మిది రోజుల పాటు లలితాసహస్రనామం, దుర్గాసప్తశతి, అష్టోత్తర శతనామ పాఠం చేస్తారు. ప్రతిరోజూ కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారం. చాలా మంది ఈ సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరించి, తలలో కొత్త జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి మానేస్తారు. ఇవన్నీ భక్తిలోని కట్టుదిట్టతను సూచిస్తాయి. పండితుల అభిప్రాయం ప్రకారం, నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ పూజలు ఇతర వ్రతాల కంటే అత్యంత శ్రద్ధతో, నిబద్ధతతో చేయాలి. భక్తి భావంతో చేసిన పూజలకు అమ్మవారు వెంటనే ప్రసన్నమవుతారని నమ్మకం ఉంది. అందుకే శరన్నవరాత్రి కాలంలో ప్రతి ఒక్కరూ తపస్సులా జీవించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులు విశ్వసిస్తారు.
అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులలో ప్రతి రోజూ అమ్మవారి విభిన్న అవతారాలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి నుంచి మహాగౌరి, సిద్దిదాత్రి వరకు భక్తుల కోరికలను తీర్చే రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు పూలతో, దీపాలతో అలంకరించి, గర్జనమయమైన శోభను సంతరించుకోనున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు కేవలం పండుగ మాత్రమే కాకుండా, భక్తిలో క్రమశిక్షణ, జీవన విధానంలో పవిత్రతను పెంపొందించే ఆధ్యాత్మిక పాఠమని పెద్దలు చెబుతారు. అందువల్ల ఈ తొమ్మిది రోజులు ప్రతీ భక్తుడు నియమ నిష్టలతో గడిపి, దుర్గమ్మ కృపను పొందాలని పండితులు సూచిస్తున్నారు.































