దేవి నవరాత్రి పండుగ సందర్భంగా కేంద్రం మహిళలకు ఒక ముఖ్యమైన బహుమతిని ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల అదనపు ఉచిత LPG కనెక్షన్లను ఆమోదించింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 105.8 మిలియన్లకు చేరుకుంటుందని పెట్రోలియం – సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద 2.5 మిలియన్ల డిపాజిట్ రహిత కనెక్షన్ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.676 కోట్ల ఖర్చును ఆమోదించింది. ఇందులో కనెక్షన్‌కు రూ.2,050 చొప్పున రూ.512.5 కోట్లు అలాగే సబ్సిడీ కోసం రూ.160 కోట్లు కేటాయించారు. ఒక 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ, సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది సిలిండర్ల వరకు వర్తిస్తుంది.
లబ్ధిదారులకు లభించే ప్రయోజనాలు:
ఈ పథకం కింద ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్, ప్రెజర్ రెగ్యులేటర్, సేఫ్టీ గొట్టం, కన్స్యూమర్ కార్డ్, ఇన్‌స్టాలేషన్ ఛార్జీల ఖర్చును భరిస్తాయి. మొదటి రీఫిల్ – స్టవ్ కూడా ఉచితంగా అందిస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న మహిళలు ఒక సరళమైన KYC ఫామ్.. డిప్రివేషన్ డిక్లరేషన్ ను ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని ఏదైనా ప్రభుత్వరంగ LPG ఏజెన్సీలో అందజేయాలి. అప్లికేషన్ ధృవీకరణ తర్వాత కనెక్షన్లు జారీ చేస్తారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు సవరించిన eKYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పథకం చరిత్ర:
ఈ పథకం మే 2016లో ప్రారంభమైంది. మొదటి దశలో 80 మిలియన్ల కనెక్షన్ల లక్ష్యం సెప్టెంబర్ 2019లో పూర్తయ్యింది. ఆ తర్వాత ఉజ్వల 2.0 ఆగస్టు 2021లో ప్రారంభమై జనవరి 2022 నాటికి అదనంగా 10 మిలియన్ కనెక్షన్లు జారీ చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా 2.5 మిలియన్ల అదనపు కనెక్షన్లను విడుదల చేయడం మహిళల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తుందని.. ఇది దుర్గాదేవి వంటి మహిళలను గౌరవించాలనే ప్రధాని మోదీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఉజ్వల పథకం మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కుటుంబాల భవిష్యత్తును మెరుగుపరచడంలో చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
































