మొగల్రాజపురంలోని కొండపై ధనకొండ అమ్మవారి ఆలయం
బెజవాడ పేరు వింటే అందరికి గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ. జగన్మాత దుర్గమ్మ తొలుత మొగల్రాజపురంలో పాదం మోపి అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరారని ప్రతీతి..
దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరడానికి ముందుగా దక్షిణాభిముఖంగా విజయవాడ మొగల్రాజపురం(ధనకొండ)లోని కొండపై ఒక చిన్న గుహలో శ్రీ చక్రపీఠం, పాదాలు, నేత్రాల రూపంలో కొలువుదీరారని భక్తులు చెబుతుంటారు. దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు రాత్రివేళ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి మొగల్రాజపురంలోని ధనకొండ ఆలయానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఆలయంలో అమ్మవారి పాదముద్రలు కూడా ఉన్నాయని ప్రచారం. అమ్మవారి గర్భగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతర్భాగంగా ఉన్న శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు మొగల్రాజపురంలోని ధనకొండ అమ్మవారిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ.































