ఏఐ నేర్చుకుంటేనే జాబ్స్.. రిస్క్‌లో కోడింగ్, కంప్యూటర్ సైన్స్ కూడా

కంప్యూటర్ సైన్స్ చెయ్ బ్రో.. మస్తు జాబ్స్ దొరుకుతయ్.. ఒకప్పుడు క్యాంపస్‌ ఆవరణల్లో ఏ నలుగురు కలిసినా ఇలాంటి మాటలు తరచుగా వినిపించేవి.


కానీ ఇప్పుడు వాటికి కాలం చెల్లుతోంది. ఏఐ ప్రవేశంతో ‘కోడింగ్’ కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు కాస్త డిమాండ్ తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. అందుకు కారణం జాబ్ మార్కె్ట్ అంతా ఏఐ స్కిల్స్‌పై ఫోకస్ చేయడమే. ఆ స్కిల్స్ లేని కారణంగా తాము పలు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రిజెక్ట్ అయ్యామని పర్డ్యూ, ఓరెగాన్ స్టేట్, జార్జ్‌టౌన్ వంటి యూనివర్సిటీలకు చెందిన కొందరు గ్రాడ్యుయేట్లు సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవాలు సైతం వైరల్ అవుతూ పలువురిని ఆలోచింపజేస్తున్నాయి.

నిపుణుల ప్రకారం కూడా.. ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలు, ముఖ్యంగా టెక్ సెక్టార్‌లో అనుభవజ్ఞులైన టెక్ ఇంజినీరింగ్ నిపుణుల కొరత వేధిస్తుండగా.. మరోవైపు ఆధునిక సాంకేతికతపై పట్టున్న ఫ్రెషర్స్ కొరత కూడా బాగానే ఉంటున్నది. వాటి జాబ్ నోటిఫికేషన్లలో ఏఐ సాంకేతిక నైపుణ్యాలే ప్రధాన అర్హతగా ఉండటంతో ఇవి కలిగి ఉన్నవారి మధ్యే ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న పరిస్థితులు విదేశాల్లో నెలకొంటున్నాయి. దీంతో సాధారణ గ్రాడ్యుయేట్లు, చివరకు కంప్యూటర్ సైన్స్, కోడింగ్ వంటి డిగ్రీలు, స్కిల్స్ ఉన్నవారు సైతం తిరస్కరణకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అన్ని రంగాల్లో, అన్ని దేశాల్లో ఇప్పటికిప్పుడు ఇదే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు. అదే సందర్భంలో ఈ స్కిల్స్ ఉన్నవారికి మిగతా వారికంటే ఉద్యోగాల్లో డిమాండ్ పెరగొచ్చు. మొత్తానికి భవిష్యత్ జాబ్ మార్కెట్ అంతా ఏఐ స్కిల్స్ వంటి ఆధునిక సాంకేతికపై ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.