ఏపీలో యాక్సెంచర్ కొత్త క్యాంపస్‌.. 12 వేల ఉద్యోగాలు రానున్నాయి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం రానుందా? అవుననే సమాధానమే వస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.


విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటుకు పది ఎకరాల భూమి కోరినట్లు సమాచారం. అయితే దీనిపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది.

విశాఖలో ఐటీ హబ్ దిశగా

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ క్యాంపస్, కాగ్నిజెంట్ కార్యాలయాలు ఏర్పాటయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా యాక్సెంచర్ కూడా విశాఖలో కొత్త క్యాంపస్ కోసం ఆసక్తి చూపుతుండటం రాష్ట్రానికి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు అమలు అయితే ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా.

ప్రభుత్వ సహకారం

ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం 99 పైసలకే ఎకరం చొప్పున భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో యాక్సెంచర్ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. భూమి కేటాయింపు విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు

కాగ్నిజెంట్ 183 మిలియన్ డాలర్లు, టీసీఎస్ 154 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రెండు సంస్థల ద్వారానే దాదాపు 20 వేల ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక తర్లువాడలో గూగుల్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనుంది. దాని కోసం సముద్రంలో నుంచి కేబుల్స్ తీసుకురావాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

ఏపీకి బంగారు దశ?

విశాఖపట్నాన్ని ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ తర్వాత ఇప్పుడు యాక్సెంచర్ కూడా అడుగులు వేస్తే రాష్ట్ర యువతకు మరింత ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తానికి విశాఖపై అంతర్జాతీయ ఐటీ సంస్థల దృష్టి పడటం రాష్ట్రానికి ఆర్థికంగా కూడా మేలు చేయనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.