తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశంలో తొలిసారిగా AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (ICCC)ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసింది.
Rs 30 కోట్ల ఖర్చుతో ఎన్.ఆర్.ఐ.ల దాతృత్వంతో ఈ ఆధునిక సదుపాయాన్ని సిద్ధం చేశారు. భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గించడం, సౌకర్యవంతం, సురక్షితంగా మార్చడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రియల్-టైమ్ రద్దీ అంచనా, ఫేస్ రికగ్నిషన్, 3D మ్యాప్స్, సైబర్ థ్రెట్ మానిటరింగ్ వంటి AI ఫీచర్లతో ఈ సెంటర్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో కీలకంగా సేవలు అందించనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 25న దీనిని ప్రారంభిస్తారు. ఈ చర్య TTD ఆధునికీకరణలో మైలురాయిగా నిలుస్తోంది.
ఈ ICCC ఆలయ నిర్వహణలో టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచడానికి TTD తీసుకున్న చర్యలో భాగం. మంత్రి నారా లోకేష్ గతేడాది అక్టోబర్ లో అమెరికా పర్యటన సమయంలో ఆలోచించారు. అక్కడ ఎన్.ఆర్.ఐ.లు TTD ప్రెజెంటేషన్‌కు స్పందించి, పూర్తి దాతృత్వంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. తిరుమలకు వచ్చి వారు చర్చించారు. ఫిబ్రవరి సమావేశాల్లో ఇది ఫైనలైజ్ అయింది. ఈ సెంటర్ మునుపటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను భర్తీ చేస్తూ, 25 మందికి పైగా టెక్నికల్ స్టాఫ్‌తో నడుస్తుంది. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ AI సెంటర్ కీలకం కానుంది.
ఈ ICCCలో AI, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ద్వారా భక్తుల అనుభవాన్ని మార్చేలా డిజైన్ చేశారు. అలిపిరి గేట్‌ల నుంచి భక్తుల ప్రవాహాన్ని స్పెషల్ కెమెరాలతో మానిటర్ చేసి, క్యూ లెంగ్త్, వెయిటింగ్ టైమ్‌లు అంచనా వేస్తారు. CCTV ఫీడ్‌లను స్క్రీన్‌పై చూపిస్తూ, రెడ్ స్పాట్స్ హైలైట్ చేస్తుంది. క్యూ లైన్స్, వసతి, ఇతర సౌకర్యాలను 3D విజువల్స్‌తో పర్యవేక్షిస్తుంది. ఇంటరాక్టివ్ మ్యాప్స్ ద్వారా సర్వదర్శన స్టేటస్ అప్‌డేట్ చేస్తుంది. ఎమర్జెన్సీల్లో సేఫ్ రూట్స్ చూపించి, ఎవాక్యుయేషన్ ప్లాన్‌లు అందిస్తుంది. భక్తుల సెంటిమెంట్ అనలిసిస్ విశ్లేషించి ఇబ్బందులు గుర్తించి, రెస్పాన్స్ ఇస్తుంది. తప్పుడు సమాచారం, సైబర్ దాడులను మానిటర్ చేసి, TTD ఇమేజ్‌ను రక్షిస్తుంది. రియల్-టైమ్ అలర్ట్స్, ఫీడ్‌బ్యాక్ కలెక్షన్ కూడా చేస్తుంది. ఈ ఫీచర్లు భక్తులకు వెహికల్ సర్వీసెస్, లాకర్ సర్వీసెస్, అన్నదానం వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.































