ఉద్యోగులకు కేంద్రం నుంచి తీపికబురు

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అద్దిరిపోయే కానుకను ప్రకటించనుంది. ప్రతి సంవత్సరం దీపావళి పండగను పురస్కరించుకుని ఇచ్చే కానుకే ఇది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు అవి. రైల్వే మంత్రిత్వ శాఖ వీటిని సిద్ధం చేసింది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఇవి రానున్నాయి.

ఒక్కో ఉద్యోగికి 78 రోజుల పని దినాలకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వొచ్చు. అలాగే- రైల్వేలో గెజిటెడ్ హోదాలో పని చేసే ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేవని సమాచారం. నాన్ గెజిటెడ్ కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్‌ను వర్తింపజేయవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం రైల్వేలో నాన్ గెజిటెడ్ హోదాలో 11.27 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. వేర్వేరు స్థాయిల్లో కొనసాగుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారందరికీ లబ్ది కలుగుతుంది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ రూపంలో 78 రోజులకు సమానమైన వేతనాన్ని అదనంగా చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా 1,832.09 కోట్ల రూపాయల మేర భారం పడుతుంది.

కాగా- ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపు కోసం కమిటీ సూచించిన వేతన సీలింగ్ నెలకు 7,000 రూపాయలు. ఇది కనీస మొత్తంగా పరిగణించాల్సి ఉంటుందని కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే ఒక్కో ఉద్యోగి అర్హతను బట్టి గరిష్ఠంగా 17,951 రూపాయలను బోనస్‌గా చెల్లిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్ప్రేరకంగా పని చేసిందని, వారు చేసిన సేవలకు పరిగణనలోకి తీసుకుని ఈ బోనస్‌ను చెల్లించనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఉత్పాదకత-ఆధారిత బోనస్‌ను పెంచాలనేది రైల్వే ఉద్యోగ సంఘాల దీర్ఘకాల డిమాండ్‌. ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీ ఫెడరేషన్ (IREF) వివరాల ప్రకారం- ఆరో పే కమిషన్ కనీస జీతం నెలకు 7,000 ఆధారంగా ఉత్పాదకత-ఆధారిత బోనస్ చెల్లిస్తున్నారు. ఏడవ పే కమిషన్ దీన్ని కనీస జీతం 18,000 రూపాయలకు సవరించింది. ఆరో పే కమిషన్ కనీస జీతం ఆధారంగా ప్రభుత్వం ఉత్పాదకత-ఆధారిత బోనస్‌ను చెల్లిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.