వృద్ధాప్యంలోకి వచ్చిన తరవాత ఆర్థిక భద్రత ఎంతో అవసరం. జీవితాంతం డబ్బు సంపాదించినవాళ్లు వృద్ధాప్యంలో అయినా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు.
కానీ సరైన ప్రణాళిక లేనట్లయితే ఆ సమయంలోనూ ప్రశాంతమైన జీవితం గడపలేరు. కాబట్టి వారు ఆర్థికంగా బలంగా ఉండేందుకు ప్రతినెల పెన్షన్ వచ్చే పథకాల్లో చేరాలి. అలాంటి ఓ పథకమే ప్రధానమంత్రి వయ వందన యోజన. ఈ పింఛన్ పథకాన్ని 2017లో కేంద్రం ప్రారంభించింది. 60ఏళ్లు దాటిన వ్యక్తులు ఆ తరవాత ఆనందంగా గడపటానికి (ఎల్ఐసీ) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఈ స్కీమ్ తీసుకువచ్చింది.
ఈ పథకంలో చేరాలంటే 60ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఇందులో గరిష్ఠ వయసులో ఎలాంటి పరిమితి లేదు. పాలసీ వ్యవధి కనీసం పదేళ్లు ఉంటుంది. అంతే కాకుండా ఫించన్ నెలకు రూ.1000 నుండి గరిష్ఠంగా నెలకు రూ.9,250 వరకు ఉంటుంది. ఫించన్ తీసుకునేందుకు ప్రతినెలా, రెండు మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇలా నచ్చినట్టుగా పాలసీని ఎంచుకోవచ్చు. ఇందులో పదేళ్ల వ్యవధిలో ఏడాదికి దాదాపు 7.66శాతం రిటర్న్స్ అందుతాయి. పాలసీ గడువు ముగిసిన తరవాత ఫించన్ దారుడికి అతడు కట్టిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. ఫించన్ దారుడు గనక మధ్యలోనే మరణిస్తే డబ్బును నామినీకి ఇస్తారు.
మరోవైపు పాలసీ తీసుకున్న మూడేళ్ల తరవాత ఫించన్ దారుడికి రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాలసీని ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న తరవాత నిబంధనలు నచ్చకపోతే కొనుగోలు చేసిన 15 రోజుల్లో రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో తీసుకున్నవాళ్లు నెల రోజుల వరకు పాలసీ రద్దు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు డబ్బు అర్జెంట్ గా అవసరం అయితే ఫించన్ దారుడికి లేదా అతడి భాగస్వామికి అత్యవసర చికిత్స అవసరమైతే పాలసీ నుండి బయటకు పాలసీ రద్దు చేసుకుని చెల్లించిన దానిలో 98 శాతం తిరిగి తీసుకోవచ్చు. వృద్ధాప్యంలో పెన్షన్ తీసుకోవాలని అనుకునేవారికి ఈ పథకం మంచి ఆప్షన్ అవుతుంది…
































