దసరాకు ఇవి కూడా ఇవ్వకపోతే..! సర్కార్ కు ఉద్యోగుల అల్టిమేటం

పీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఉద్యోగుల విషయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది. దీనికి ప్రధాన కారణం గత సర్కార్ ఉన్నప్పటి నుంచి వారు కోరుతున్న డిమాండ్లే.


కొత్త ప్రభుత్వంలో వీటి పరిష్కారం లభిస్తుందని ఆశించినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి దసరాకు కనీసం రెండు డీఏలు, పీఆర్సీ కమిషనర్ నియామకంపై అయినా ప్రకటన చేయాలని ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చారు.

రాష్ట్ర పురోభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిశ్రమలు, సాంకేతిక రంగాల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఏపీ ఎన్జీజివో జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ ఆరోపించారు. విజయవాడ లోని ఏపీ ఎన్జీ జిఓ హోమ్ లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

దసరా కానుకగా కనీసం రెండు డీఏలను ఉద్యోగులకు ఇచ్చేలా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాల నష్టపోయారని, ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.27,000 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. నూతన ప్రభుత్వం కొంత బకాయిలు చెల్లింపు జరిపినప్పటికి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో సింహభాగం అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నాలుగు డి.ఏలు పెండింగ్‌లో ఉండగా తక్షణమే దసరా పండుగకు డి.ఎ. ప్రకటించి ఉద్యోగులకు తాత్కాలిక ఉపసమనం కల్పించాలన్నారు.

ఉద్యోగుల వేతనాలపై నియమించాల్సిన పిఆర్సి కమిషన్ కాలపరిమితి 25 నెలల కాలం జరిగినప్పటికీ పి.ఆర్.సి కమిషనర్ ని నియమించకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం తలెత్తలేదన్నారు. ఎప్పుడైనా పిఆర్సి ఫిట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ పిఆర్సి కమిటీ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఇంతవరకు లేదన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కనీసం ఆర్థికేతర ఇబ్బందులు లేని హెల్త్ కార్డులను సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు. వైద్య సేవలు సక్రమంగా అందడం గగనంగా మారిందన్నారు. ఉద్యోగులు ప్రతి నెల 300 రూపాయలు కడుతున్నప్పటికీ వైద్య సేవలు ఎన్ని సంవత్సరాలైనా అందకపోవడం శోచనీయమన్నారు. దీనిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని, పదవి విరమణ చేసి నాలుగు సంవత్సరాల అయినా కూడా చెల్లింపులు జరగకపోవడం శోచనీయమని తెలిపారు. గ్రాట్యూటీ విషయంలో సరెండర్ లెవెల్ విషయంలో మిగిలిన వాటి విషయంలో ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రావాల్సిన వాటిని అన్న వారికి జమ అయ్యేటట్లు చూడాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు.

ఏపీ జెఎసి సెక్రటరీ జనరల్ కె.ఎస్‌.ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు పంచాయతీ రాజ్ శాఖలో కూడా అమలు చేయాలన్నారు. దసరా పండుగను నిజమైన పండుగగా ఉద్యోగులు జరుపుకునేట్లు చూడాలని కోరారు. ఏపీ జెఎసి ద్వారా ఉద్యోగులకు మరింతగా సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మండలాల జేఏసీల్ని అక్టోబర్ నెలలో పునర్వ్యవస్థీకరిస్తున్నామన్నారు. అక్టోబర్ నాటికి నూతన జేఏసీ కమిటీలు ఏర్పడతాయని తెలిపారు. అక్టోబర్ నెలకి జేఏసీ రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద ముందుకు రాని పక్షంలో ఏపీ జెఎసి ముందు వేరే ప్రచారం న్యాయం ఏమీ లేదని పోరాటమే ప్రత్యామ్నాయమన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.